Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీల్డింగ్‌లో కోహ్లిసేన తడబాటు
- లక్ష్యాలు నిర్దేశించటంలో కనిపించని దూకుడు
మిషన్ 2020. విజన్ 2019లో అనూహ్య భంగపాటుకు గురైన టీమ్ ఇండియా ఇప్పుడు పొట్టి కప్పుపై కన్నేసింది. 2016లో స్వదేశంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగినా, కరీబియన్ల చేతిలో పరాభవం టైటిల్ ఆశలను ఆవిరి చేసింది. టీ20 ప్రపంచకప్‌కు మరో ఏడాది సమయమే ఉన్న నేపథ్యంలో కోహ్లిసేన పొట్టి ఫార్మాట్‌లో నిలకడ కోసం కృషి చేస్తోంది. సన్నాహకం ఆరంభించిన తొలి నాళ్లలోనే భారత్‌కు మంచి పాఠాలు ఎదురయ్యాయి. ఫీల్డింగ్‌లో ఆయాచితంగా క్యాచులు నేలపాలు చేయటం, లక్ష్యాలు నిర్దేశించటంలో దూకుడు లోపించటం ప్రధానమైనవి. 2020 ప్రపంచకప్ ఆశించడానికి ముందు భారత్ ఈ సవాళ్లను అధిగమించాల్సి ఉంది.
నవతెలంగాణ క్రీడా విభాగం
2020 టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న టీమ్ ఇండియా ఈ క్రమంలో దీర్ఘకాలంగా వేధిస్తోన్న ప్రధాన సమస్యను విస్మరించినట్టు కనిపిస్తోంది. పొట్టి ఫార్మాట్‌లో భారీ లక్ష్యాలు ఛేదించటంలో కోహ్లిసేన రాటుదేలింది. ఇదే సమయంలో భారీ లక్ష్యాలను నిర్దేశించటంలో అంతే స్థాయిలో విఫలమైంది. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ను వేధిస్తోన్న ప్రధాన సమస్య ఇది. ఇదే సమయంలో ఇటీవల మరో సమస్య తోడైంది. వరుస మ్యాచుల్లో క్యాచులు నేలపాలు కావటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరో ఏడాదిలో పొట్టి ప్రపంచకప్‌కు వెళ్లాల్సిన సమయంలో ముందుగా ఈ లోపాలను కోహ్లిసేన సరిదిద్దుకోవాల్సి ఉంది.
క్యాచులు నేలపాలు : ఇటీవల కాలంలో టీమ్ ఇండియా ఫీల్డింగ్‌లో గొప్ప పురోగతి సాధించింది. 2019 ప్రపంచకప్ సమయంలోనూ భారత్‌ది అత్యుత్తమ ఫీల్డింగ్ జట్టు. కానీ తాజాగా ముగిసిన బంగ్లాదేశ్‌తో సిరీస్ నుంచి క్యాచులు అందుకోవటంలో తడబాటు కనిపిస్తోంది. కోల్‌కత గులాబీ టెస్టు మ్యాచ్‌లో, ఇండోర్ టెస్టులోనూ విలువైన క్యాచులు జారవిడిచారు. పొరపాటును అర్ధం చేసుకోవచ్చు, కానీ అదే అలవాటుగా మారటంతో ఆందోళనకు కారణం అవుతోంది. వెస్టిండీస్‌తో హైదరాబాద్ టీ20లో భారత్ ఐదు క్యాచులు నేలపాలు చేసింది. తిరువనంతపురం టీ20లోనూ అదే పొరపాటు పునరావృతం అయ్యింది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రెండు క్యాచులు నేలపాలయ్యాయి. తొలుత లెండ్లి సిమోన్స్ క్యాచ్‌ను మిడ్ ఆఫ్‌లో వాషింగ్టన్ సుందర్ జారవిడిచాడు. అప్పటికీ సిమోన్స్ స్కోరు 6 పరుగులు. సిమోన్స్ తర్వాత 45 బంతుల్లో 67 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అదే ఓవర్లో ఎవిన్ లెవిస్ అందించిన క్లిష్టమైన క్యాచ్‌ను వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుకోలేకపోయాడు. ఆరంభంలోనే ఓపెనర్లు ఇద్దరికీ జీవనదానం లభించింది. పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బౌలర్ల శ్రమ వృథా అయిపోయింది. తర్వాత ఇన్నింగ్స్ 17వ ఓవర్లో నికోలస్ పూరన్ క్యాచ్‌ను శ్రేయాష్ అయ్యర్ వదిలేశాడు.
క్యాచులు మ్యాచులను గెలిపిస్తాయి. ఈ ఫార్ములాను కోహ్లిసేన గుడ్డిగా విస్మరిస్తోంది!. రెండో టీ20లో ఓపెనర్ల క్యాచులను అందుకుని ఉంటే, వెస్టిండీస్‌పై ఒత్తిడి పెరిగేది. మ్యాచ్ గమనాన్ని ఆ రెండు క్యాచులు నిర్దేశించేవి. క్యాచులు నేలపాలు కావటంతో మ్యాచ్ పూర్తిగా విండీస్ ఆధిపత్యం సాగింది.
ఆ దూకుడు ఏమైంది? : హైదరాబాద్ టీ20లో భారత్ తన అత్యధిక లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. విధ్వంసకారుడు రోహిత్ శర్మ సహకారం లేకుండా 208 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. జట్టులో ఎవరు ఉన్నా, లేకపోయినా ఛేదనలో టీమ్ ఇండియాకు మంచి రికార్డుంది. 2018 జనవరి 1 నుంచి భారత్ 18 మ్యాచుల్లో లక్ష్యాలను ఛేదించేందుకు బరిలోకి దిగింది. అందులో 14 మ్యాచుల్లో విజయాలు అందుకోగా.. కేవలం మూడు సార్లు మాత్రమే లాంఛనం ముగించలేదు. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇదే సమయంలో టీమ్ ఇండియా 16 మ్యాచుల్లో ప్రత్యర్థులకు లక్ష్యాలను నిర్దేశించింది. వాటిలో ఎనిమిదింట విజయాలు నమోదు చేయగా, మరో ఎనిమిది మ్యాచుల్లో పరాజయం మూట గట్టుకుంది. లక్ష్యాలను ఛేదించినప్పుడు సాధించాల్సిన రన్‌రేట్‌ను దృష్టిలో ఉంచుకుని భారత్ ముందుకు సాగుతోంది. కానీ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు ఏ స్థాయిలో రెచ్చిపోవాలనే అంచనా లేకుండా పోతుంది. అందుకే తొలుత బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో భారత్ భారీ స్కోరుకు దూరంగానే ఉంటోంది. చేతిలో వికెట్లు ఉన్న సమయంలోనూ రన్‌రేట్ పెంచటంలో విఫలమైన సందర్బాలు ఉన్నాయి. ప్రపంచకప్‌కు మరో ఏడాది సమయం ఉంది. ఈ కాలంలోనే భారత్ ఎక్కువగా తొలుత బ్యాటింగ్ చేసి, భారీ స్కోర్లు సాధించటంపై దృష్టి సారించాలి. వరల్డ్‌కప్‌లోనూ భారత్ గెలుపోటములను టాస్ నిర్ణయించే పరిస్థితి ఉండకూడదు.
మరో 15 పరుగులు అదనంగా చేసి ఉంటే స్కోరు కాపాడుకునేవాళ్లం. కానీ ఇటువంటి ఫీల్డింగ్‌తో ఎంత స్కోరు చేసినా సరిపోదు. గత రెండు మ్యాచుల్లో ఫీల్డింగ్‌లో మేం దారుణ ప్రదర్శన చేశాం. బంతితో మెరుగ్గా రాణించాం, తొలి నాలుగు ఓవర్లలో చాలినన్ని అవకాశాలు సృష్టించుకోగలిగాం. టీ20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో రెండు క్యాచులు నేలపాలు చేసినప్పుడు అది మ్యాచ్‌ను పోగొడుతుంది. ఫీల్డింగ్‌లో భారత్ మరింత మెరుగ్గా ఉండాలి, క్యాచులు నేలపాలు చేయటంపై ఆందోళన చెందకుండా ధైర్యంగా ఫీల్డింగ్ చేయాలి'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
2020 టీ20 ప్రపంచకప్‌పై నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో ఆ విషయాలు పంచుకుంటాను. పొట్టి ఫార్మాట్‌లో భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తున్నప్పుడు, అదే రీతిలో భారీ స్కోర్లు (తొలుత బ్యాటింగ్) చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీమ్ ఇండియా ఈ విషయంలో మెరుగుపడాలి'
- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షడు