Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి టీ20లో భారత్ ఘన విజయం
- సిరీస్ 2-1తో కోహ్లిసేన సొంతం
నవతెలంగాణ-ముంబయి
టాస్ నెగ్గలేదు. మంచు ప్రభావంలో బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అయినా, టీ20 సిరీస్ విజయానికి భారత్ దూరం కాలేదు. టీమ్ ఇండియా సవాల్‌ను ఎదుర్కొంది!. 2-1తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు నమోదు చేసింది. వాంఖడే మైదానంలో పరుగుల వరద పారించింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (91, 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోహిత్ శర్మ (71, 34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (70 నాటౌట్, 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. రాహుల్, రోహిత్, విరాట్ విజృంభణతో భారత్ తొలుత 240 పరుగులు చేసింది. రికార్డు ఛేదనలో వెస్టిండీస్ 173/8తో చతికిల పడింది. 67 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
రాహుల్, రోహిత్ జోరు : నిర్ణయాత్మక టీ20లో కీలక టాస్ ఓడిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. బ్యాటింగ్ పిచ్‌పై ఓపెనర్లు రోహిత్ శర్మ (71), కెఎల్ రాహుల్ (91) ధనాధన్ షాట్లతో చెలరేగారు. పవర్ ప్లేలోనే ఓపెనర్లు ఏకంగా 72 పరుగులు పిండుకున్నారు. రాహుల్, రోహిత్ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో భారత్ 8 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ దాటేసింది. బౌండరీలపై కన్నేసిన రోహిత్, రాహుల్ కరీబియన్ బౌలర్లను ఎడాపెడా బాదేశారు. రోహిత్ శర్మ 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ బాదాడు. కెఎల్ రాహుల్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 29 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఓపెనర్ల వీరంగంతో భారత్ రికార్డు స్కోరు దిశగా సాగింది. భారీ షాట్ ఆడబోయి రోహిత్ శర్మ డగౌట్‌కు చేరగా 135 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మూడో స్థానంలో వచ్చిన యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ (0) రెండు బంతులాడి పరుగులేమీ చేయకుండానే వికెట్ పారేసుకున్నాడు.
విరాట్ విధ్వంసం : విరాట్ కోహ్లి వాంఖడేలో శైలికి విరుద్ధమైన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. క్లాసికల్ షాట్లతో మెరిసే కోహ్లి.. వాంఖడేలో తొలి బంతి నుంచే విరుచుకుపడ్డాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 70 పరుగులు పిండుకున్నాడు. కీరన్ పొలార్డ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టిన కోహ్లి 27 పరుగులు పిండుకున్నాడు. అంతకముందు హౌల్డర్ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ సంధించాడు. కోహ్లికి రాహుల్ సైతం తోడవటంతో స్కోరు వేగంగా ముందుకు సాగింది. అర్థ సెంచరీ తర్వాత రాహుల్ మరో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. కోహ్లి విధ్వంసక విశ్వరూపం దాల్చటంతో భారత్ 240 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచిన కోహ్లి ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు.
టీ20 సమరాల్లో బౌండరీ మీటర్‌లో వెనుకబడిన కోహ్లిసేన వాంఖడేలో కొత్త రికార్డు నెలకొల్పింది. 16 సిక్సర్లు, 19 సిక్సర్లతో బౌండరీల రూపంలోనే ఏకంగా 172 పరుగులు పిండుకుంది. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో భారత్ బౌండరీల రూపంలో అత్యధికంగా పరుగులు పిండుకోవటం ఇదే తొలిసారి!. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 400 సిక్సర్లు (అన్ని ఫార్మాట్లు) బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. షాహిద్ ఆఫ్రిది, క్రిస్ గేల్ సిక్సర్ల రేసులో రోహిత్ శర్మ కంటే ముందున్నారు.
బౌలర్లు మెరిశారు : భారీ ఛేదనలో వెస్టిండీస్‌ను బౌలర్లు కోలుకోలేని దెబ్బకొట్టారు. పవర్ ప్లేలోనే కింగ్ (5), సిమోన్స్ (7), పూరన్ (0) వికెట్లను పడగొట్టి విండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. హెట్మయర్ (41, 24 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు), కీరన్ పొలార్డ్ (68, 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆశలు రేపినా.. కుల్దీప్, భువి ఈ ఇద్దరినీ డగౌట్‌కు చేరి విండీస్ ఆశలపై నీళ్లు చల్లారు. సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరగటంతో టెయిలెండర్లు చేతులెత్తేశారు. బౌలర్లు భువనేశ్వర్, మహ్మద్ షమి, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) హెడెన్ వాల్ష్ (బి) కెస్రిక్ విలియమ్స్ 71, కెఎల్ రాహుల్ (సి) నికోలస్ పూరన్ (బి) కాట్రెల్ 91, రిషబ్ పంత్ (సి) జేసన్ హౌల్డర్ (బి) కీరన్ పొలార్డ్ 0, విరాట్ కోహ్లి నాటౌట్ 70, శ్రేయాష్ అయ్యర్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం : (20 ఓవర్లలో 3 వికెట్లకు) 240.
వికెట్ల పతనం : 1-135, 2-138, 3-233.
బౌలింగ్ : షెల్డన్ కాట్రెల్ 4-0-40-1, జేసన్ హౌల్డర్ 4-0-54-0, కారీ పీరే 2-0-35-0, కెస్రిక్ విలియమ్స్ 4-0-37-1, హెడెన్ వాల్ష్ 4-0-38-0, కీరన్ పొలార్డ్ 2-0-33-1.