Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ వన్డేకు ముందు జట్టుతో చేరిక
ముంబయి : స్ట్రెస్ ఫ్రాక్చర్ గాయానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న భారత స్టార్ సీమర్ జశ్‌ప్రీత్ బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు రెగ్యులర్ వైద్య పరీక్షల్లో బుమ్రా గాయం బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్దిక్ పాండ్యతో కలిసి ముంబయిలో ఫిట్‌నెస్ సాధనకు శిక్షణ తీసుకుంటున్న బుమ్రా త్వరలోనే టీమ్ ఇండియా నెట్స్‌లో కనిపించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. ' బుమ్రా త్వరలోనే టీమ్ ఇండియా నెట్ సెషన్‌లో బౌలింగ్ చేయనున్నాడు. ఇప్పుడు భారత జట్టులో ఇదో నిబంధన. బంగ్లాదేశ్‌తో టెస్టుకు ముందు భువనేశ్వర్ కుమార్ ఫిట్‌నెస్‌ను సైతం టీమ్ మేనేజ్‌మెంట్ ఇండోర్‌లో నెట్ సెషన్ బౌలింగ్‌తోనే అంచనా వేసింది. నిజానికి, ఆ సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ భాగం కాదు. భువి ఫిట్‌నెస్ సాధించాడని భావించడంతోనే వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపిక చేశారు. జశ్‌ప్రీత్ బుమ్రా విషయంలోనే బోర్డు ఇదే సూత్రం పాటిస్తోంది' అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. డిసెంబర్ 17న వెస్టిండీస్‌తో భారత్ రెండో వన్డేకు ముందు బుమ్రా టీమ్ ఇండియా నెట్ సెషన్‌లో బౌలింగ్ చేయనున్నాడు. ఈ సమయంలో జట్టు ఫిజియో నితిన్ పటేల్, ట్రైనర్ నిక్ వెబ్ సహా బౌలింగ్ కోచ్, చీఫ్ కోచ్ బుమ్రా ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించనున్నారు.