Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆసీస్ ఓపెనర్‌తో ఎం.ఎస్ ధోని
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా ఓపెనర్లు మాథ్యూ హెడెన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు ఇద్దరూ విధ్వంసకారులే. ఫామ్‌లో లేని గిల్‌క్రిస్ట్, మరింత గ్రిప్ కోసం గ్లౌవ్స్‌లో చిన్న పాటి బంతులను ఉంచుకుని బ్యాటింగ్ చేసి సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిటం అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. అదేవిధంగా మాథ్యూ హెడెన్ సైతం 'మంగూస్' బ్యాట్‌తో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడటం ఐపీఎల్ అభిమానులకు సుపరిచితమే. పొడవైన హ్యాండిల్, చిన్నదైన హిట్టింగ్ ఉపరితలం, బ్యాట్ పట్టుకునే వెనుక చేతికి మరింత బలం చేకూరేందుకు ఈ మంగూస్ బ్యాట్ తోడ్పడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన 2010 ఐపీఎల్‌లో మాథ్యూ హెడెన్ మంగూస్ బ్యాట్‌నే వినియోగించాడు. ఆ సీజన్‌లో మంగూస్ బ్యాట్‌తో ఢిల్లీ డెర్‌డెవిల్స్‌పై 43 బంతుల్లోనే 93 పరుగులు పిండుకున్నాడు హెడెన్. అప్పట్లో హెడెన్ మంగూస్ బ్యాట్ ఓ సంచలనం!. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని మంగూస్ బ్యాట్ వినియోగంపై తనతో చెప్పిన మాటలను హెడెన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. హెడెన్ వ్యాఖ్యలను చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ ఖాతాలో ఉంచింది. ' ఈ మంగూస్ బ్యాట్ వాడకుండే ఉండేందుకు..నీ జీవితంలో ఏం కావాలని అనుకుంటే అది నీకిస్తాను. దయచేసి ఈ బ్యాట్ మళ్లీ వాడకు' అని ధోనితో తనతో అన్నట్టు హెడెన్ చెప్పుకొచ్చాడు. అప్పటికి ఏడాది కాలంగా ప్రాక్టీస్ సెషన్లో మంగూస్ బ్యాట్‌ను వాడాడు హెడెన్. మంగూస్ బ్యాట్ మధ్యలో బంతి తగిలితే, బంతి 20 మీటర్లు అదనంగా ముందుకు వెళ్తుందని హెడన్ తెలిపాడు.