Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి
ముంబయి : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ క్రికెట్‌ను స్తంభింపజేసింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు తర్వాత టీమ్ ఇండియా మైదానంలోకి అడుగుపెట్టలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చినా, రాకపోయినా ఆంక్షల నడుమ క్రికెట్ సీజన్ పున ప్రారంభించేందుకు ఓ వైపు ప్రణాళిక సిద్ధమవుతోంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై ఐసీసీ పట్టుదలగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా సైతం నిర్వహణకే మొగ్గుచూపుతోంది. అందుకు కోసం క్రికెట్ ఆస్ట్రేలియాతో ఐసీసీ నిరంతర సంప్రదింపులు జరుపుతోంది. కరోనా వైరస్ మహమ్మారితో అన్ని చోట్లా లాక్‌డౌన్ విధించారు. క్రికెటర్లు మ్యాచ్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ సాధించేందుకు కనీసం ఓ నెల పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో నేరుగా వరల్డ్ టోర్నీలను నిర్వహించటం సరైనది కాదని భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడుతున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్‌తో సీజన్‌ను ఆరంభించటం మంచిదని అంటున్నాడు. ' ఈ పరిస్థితుల్లో ఐసీసీ టోర్నీల నిర్వహణపై ఎక్కువగా ఆసక్తి చూపించకూడదు. అందరూ ఇండ్లలోనే ఉంటున్నారు. తొలుత దేశవాళీ క్రికెట్ మొదలవ్వాలని ఆశిద్దాం. అన్ని స్థాయిల్లో క్రికెటర్లు తొలుత మైదానాల్లోకి రావాలి. అదే అన్నింటి కంటే ప్రధానమైన అంశం. రెండోది అంతర్జాతీయ క్రికెట్ సీజన్‌ను ద్వైపాక్షిక సిరీస్‌లతోనే ఆరంభించాలి. ఐసీసీ వరల్డ్ టోర్నీ, ద్వైపాక్షిక సిరీస్‌లలో మేం ద్వైపాక్షిక సిరీస్‌నే ఎంచుకుంటాం. 15 జట్లు ఒకచోటుకి చేరి ఆడటం కంటే.. ఒక జట్టుతో కలిసి ఒకే వేదికలో సిరీస్‌ను ముగించవచ్చు. క్రికెట్ సీజన్ ఆరంభం కాగానే ఐపీఎల్‌కు మా తొలి ప్రాధాన్యం. ఎందుకంటే ఐపీఎల్‌ను 1-2 నగరాల్లోనే ఆడవచ్చు. లాజిస్టికల్ ఇబ్బందులు ఉండవు. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.