Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంగూలీ, అరుణ్ పరోక్ష సంకేతాలు
- ఐపీఎల్13 రద్దుతో ఆ పరిస్థితి తప్పదు
అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ఒక్క సీజన్ ఐపీఎల్‌తోనే ఏకంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం సొంతమవుతుంది. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌తో రూ. 65 కోట్లు ఖాతాలో వేసుకుంటుంది. ఐసీసీ ఆదాయంలో మెజార్టీ వాటా భారత క్రికెట్ బోర్డు ఖాతాల్లోకే వెళ్తోంది. అటువంటి ధనిక క్రికెట్ బోర్డు వేతకాల కోత నిర్ణయం తీసుకుంటుందని ఎవరైనా ఊహిస్తారా? కచ్చితంగా లేదు!.
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) షేర్ మార్కెట్ నష్టాలతో ఉద్యోగులకు కేవలం 20 శాతం వేతనాలే అందిస్తోంది. బిగ్3 క్రికెట్ బోర్డు సీఏ ఆర్థిక పరిస్థితి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు బీసీసీఐ అదే పని చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ రద్దుగా ముగిస్తే, భారత క్రికెట్ బోర్డులో వేతన కోత నిర్ణయం తప్పదు!.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఊహించని నిర్ణయం తీసుకోనుంది!. ఒక్క సీజన్ క్రికెట్ ఆగిపోవటం, ఒక్క సీజన్ ఐపీఎల్ నిలిచిపోవటంతోనే క్రికెటర్లకు, ఉద్యోగులకు వేతన కోత విధించేందుకు సిద్ధమవుతోంది. రూ. 10 వేల కోట్ల నగదు నిల్వ, ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్లు బీసీసీఐ ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉందని చెబుతోంది. అయినా, ఈ సీజన్ నష్టాలను కారణంగా చూపి వేతనాల్లో కోత విధించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఆటగాళ్ల వేతకాల్లో కోత మా ప్రణాళికల్లో చిట్టచివరి అంశమని చెబుతూనే.. వేతనాల కోతను పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఐపీఎల్ రద్దు అయితే బీసీసీఐ భారీగా నష్టపోనుందని కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్ వ్యాఖ్యానించగా.. ఆర్థిక పరిస్థితిపై అంచనా వేసిన తర్వాతే వేతనాల్లో కోతపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. వరుసగా కోశాధికారి, అధ్యక్షుడు వేతనాల కోత ప్రస్తావన తీసుకురావటం.. మున్ముందు వెలువడే నిర్ణయంపై పరోక్ష సంకేతాలని చెప్పవచ్చు.
బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా? : ఐపీఎల్2020 జరుగకపోతే, బీసీసీఐ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడనుందని కోశాధికారి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించగానే, అధ్యక్షుడు గంగూలీ అదే రాగం అందుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్2020 నిరవధికంగా వాయిదా పడింది. ' ఆర్థిక పరిస్థితిని పరిశీలించాల్సి ఉంది. బోర్డు వద్ద ఎంత డబ్బు ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచిస్తాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2020 నిర్వహణ సాధ్యం కాకుంటే బోర్డు రూ. 4 వేల కోట్లు నష్టపోనుంది. ఐపీఎల్ ఈ ఏడాది సాధ్యపడితే వేతనాల కోత గురించి ఆలోచించాల్సిన అవసరం బీసీసీఐకి ఉండదు' అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ' క్రికెట్ సీజన్ త్వరగా పున ప్రారంభం కాకుంటే బీసీసీఐ ఆర్థికంగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొవాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్ వీలైనంత త్వరగా జరగాలని కోరుకుంటున్నాం. బీసీసీఐకి అతి పెద్ద ఆదాయ వనరు ఐపీఎల్ మరింత కీలకం' అని గంగూలీ అన్నాడు.
ఐపీఎల్ రద్దుగా ముగిస్తే ఈ ఏడాది బీసీసీఐ సుమారు రూ. 4 వేల కోట్లను కోల్పోనుంది. భారత క్రికెట్‌తో ముడిపడిన వ్యవస్థలు సైతం ఆర్థికంగా దారుణంగా దెబ్బతిననున్నాయి. ఈ ఒక్క సీజన్ ఐపీఎల్ ఆగిపోయినంత మాత్రాన బీసీసీఐ వేతకాల కోతపై ఆలోచన చేయాల్సిన అవసరం నిజందా? ఉందా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే రెండేండ్ల క్రితమే బీసీసీఐ వద్ద రూ. 10 వేల కోట్ల నిల్వ ఉంది. 2017-18 వార్షిక ఆర్థిక నివేదికలో బీసీసీఐ బ్యాంకు ఖాతాల్లో (మార్చి 31, 2018) రూ. 5526.18 కోట్లు ఉన్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మరో రూ. 2011.83 కోట్లు ఉన్నాయి. ఇతర ఖాతాల్లో రూ. 900 కోట్లు నిల్వ ఉన్నాయి. కేవలం ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో స్టార్ ఇండియా రూ.3065 కోట్లు చెల్లిస్తోంది. 2018, 2019 సీజన్లలో స్టార్ ఇండియా రూ. 6135 కోట్లు చెల్లించింది. రెగ్యులర్‌గా ద్వైపాక్షిక సిరీస్ మ్యాచుల ద్వారా బీసీసీఐ దండిగా ఆర్జిస్తోంది. భారత్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కు రూ. 65 కోట్ల వరకు సంపాదిస్తోంది. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో బీసీసీఐ కనీసం మరో రూ. 5-6 వేల కోట్లు వెనకేసుకుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి బీసీసీఐ వద్ద కేవలం నగదు నిల్వ రూ. 10 వేల కోట్లుగా ఉందని అంచనా. ఆర్థిక మూలాలు ఇంత పటిష్టంగా ఉన్నప్పటికీ బీసీసీఐ ఉన్నతాధికారులు పదేపదే వేతకాల కోతను ఎందుకు ప్రస్తావిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ వన్నె తగ్గుతుంది! : 2020 ఐపీఎల్ రద్దుతో బీసీసీఐ మీడియా హక్కుల రూపంలో రూ. 3065 కోట్లు, కేంద్ర స్పాన్సర్‌షిప్‌ల రూపంలో రూ. 618 కోట్లు ప్రాంఛైజీల లాభంలో 20 శాతం వాటాతో రూ. 520 కోట్లు కోల్పోనుంది. ఐపీఎల్‌తో ప్రతి ఏటా సుమారు రూ. 70 వేల కోట్ల లావాదేవీలు ముడిపడి ఉన్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చనుంది. బీసీసీఐ ఆదాయం నిలుపుకునేందుకు అభిమానులు లేకుండా ఐపీఎల్‌ను నిర్వహించేందుకు ఆలోచిస్తోంది. ఆర్థికంగా ఇది గట్టెక్కించే మార్గమే అయినా, అందుకు బీసీసీఐ బాస్ గంగూలీ సిద్ధంగా ఉన్నట్లు లేడు!. ' అభిమానులు లేకుండా క్రికెట్ ఆకర్షణ చాలా తక్కువ. అటువంటి మ్యాచ్ అనుభవం నాకు గుర్తుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో 1999 ఆసియా టెస్టు చాంపియన్‌షిప్, పాకిస్థాన్‌తో మ్యాచ్. అభిమానుల అల్లరితో ఆఖరు రోజు స్టేడియంలోని ఎవరినీ అనుమతించలేదు. ఆ రోజు అభిమానుల లేకుండా, ఉత్సాహం లేని వెలితి స్పష్టంగా తెలిసింది. భౌతిక దూరం మార్గదర్శకాలు కఠినంగా అమలు చేస్తూ అభిమానులు అనుమతిస్తే, అప్పుడు అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అది కఠినమైన నిర్ణయం' గంగూలీ అన్నాడు.
క్రికెట్ సీజన్ త్వరగా ఆరంభం కాకుంటే బీసీసీఐ సైతం ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొం టుంది. ప్రత్యేకించి ఐపీఎల్ నిర్వహణ సాధ్యపడకుంటే రూ. 4 వేల కోట్లు నష్టపోతాం. బీసీసీఐ ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే వేతకాల కోతపై ఆలోచించాల్సిన అవసరం ఉండదు'
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బీసీసీఐకి ప్రధాన ఆదాయ వనరు. ఈ పరిస్థితుల్లో టోర్నీ నిర్వహణపై మాకు ఆలోచన లేదు. కానీ ఐపీఎల్ రద్దుగా ముగిస్తే బీసీసీఐ భారీగా ఆర్థిక నష్టం చవిచూడనుంది. క్రికెటర్లకు బకాయిల చెల్లింపులు జరుపుతున్నాం. ఆర్థిక పరిస్థితిపై అంచ నాకు రావాల్సి ఉంది. వేతనాల్లో కోత మా ప్రణాళికల్లో చిట్టచివరి అంశం'
- అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి