Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టులో జైషా పిటిషన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల్లో కార్యదర్శిది అత్యంత కీలక భూమిక. అన్ని పనులు కార్యదర్శి చేతులమీదుగా జరుగుతాయి. బీసీసీఐ తరఫున అధికారిక ప్రకటనలు, ఇతర అంశాలపై వైఖరి కార్యదర్శి మాత్రమే వెల్లడిస్తాడు. కానీ కొన్ని రోజులుగా కోశాధికారి అరుణ్ ధుమాల్ బీసీసీఐ కార్యకలాపాలను చురుగ్గా చూస్తున్నాడు. వివిధ అంశాలపై బోర్డు వైఖరిపై పత్రికలకు అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు. దీంతో కార్యదర్శి జై షా ఏం చేస్తున్నాడనే సందేహం చాలా మందికి కలిగింది. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం బీసీసీఐ నూతన రాజ్యాంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. రాష్ట్ర సంఘం, బీసీసీఐలో కలిపి గరిష్టంగా వరుసగా ఆరు సంవత్సరాలు మాత్రమే పదవీలో కొనసాగేందుకు వీలుంది. గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) సంయుక్త కార్యదర్శిగా జై షా 2013 నుంచి కొనసాగారు. బీసీసీఐ కార్యదర్శి పదవీ చేపట్టి తర్వాత జీసీఏ నుంచి వైదొలిగారు. గుజరాత్ క్రికెట్ సంఘం, బీసీసీఐలో పదవీ కాలం కలుపుకుని మే తొలి వారంతో ఆరేండ్లు పూర్తయ్యాయి. దీంతో జై షా అధికారికంగా కార్యదర్శి పదవికి అనర్హుడు అయ్యాడు. బీసీసీఐ కార్యదర్శిగా జై షా ప్రస్తుతం అధికారికంగా విధులు నిర్వర్తించటం లేదని సమాచారం!. భారత క్రికెట్ బోర్డులో ఆరేండ్ల పూర్తి కాలం కొనసాగేందుకు 2019 డిసెంబర్‌లో జరిగిన బీసీసీఐ 88వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో రాజ్యాంగ సంస్కరణలకు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఐసీసీలో భారత్ ప్రయోజనాలు నిలుపుకోవటం, భారత క్రికెట్ వ్యవహరాలను చక్కదిద్దటం అత్యంత కీలకమని.. ఈ సమయంలో పదవీ నుంచి తప్పుకోవటం బోర్డుకు అపార నష్టమని పేర్కొంటూ.. జై షా ఆదివారం సుప్రీంకోర్టుకు ఈమెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్యదర్శిగా పూర్తి కాలం కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని జై షా పిటిషన్‌లో కోరినట్టు తెలుస్తోంది. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పదవీ కాలం సైతం ఈ జులైతో ముగియనుంది. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)లో సౌరవ్ గంగూలీ సంయుక్త కార్యదర్శి, అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. సుప్రీంకోర్టులో జై షాకు లైన్ క్లియర్ అయితే, అది గంగూలీకి సైతం ఉపయోగపడనుంది. దీనిపై జై షా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణపై ఇప్పుడు బీసీసీఐ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.