Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌబర్ట్‌లో శ్రీలంకపై విశ్వరూపం
- 86 బంతుల్లో 133 పరుగుల ఇన్నింగ్స్
ప్రతి క్రికెటర్‌కు కెరీర్‌లో ఓ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ ఒక్క ఇన్నింగ్స్ ఆ క్రికెటర్ గమనాన్నే మార్చివేస్తుంది. ఆటను మరింత అర్థం చేసుకునేందుకు దోహదం చేస్తుంది. 1992లో నలుగురు అరివీర భయంకర ఆస్ట్రేలియా పేసర్లను చీల్చిచెండాడి భయానక పెర్త్ పిచ్‌పై సచిన్ టెండూల్కర్ చేసిన ఇన్నింగ్స్ మాస్టర్ బ్లాస్టర్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. సఫారీ పేస్‌ను ఎదుర్కొని జొహనెస్‌బర్గ్‌లో 1997లో చేసిన శతకం ది వాల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సచిన్, ద్రవిడ్ ఇద్దరూ టెస్టు ఫార్మాట్‌లో తొలుత తమదైన ముద్ర వేశారు. క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి మాత్రం తొలుత వన్డేల్లో విధ్వంసం సృష్టించాడు. అనంతరమే టెస్టుల్లోనూ విధ్వంస కాండ సాగించాడు. విరాట్ కోహ్లిని కెరీర్‌ను మలుపు తిప్పిన, సూపర్‌స్టార్ ఇమేజ్‌కు అంకురార్పణ వేసిన ఆ ఇన్నింగ్స్ హౌబర్ట్‌లో శ్రీలంకపై 86 బంతుల్లో 133 పరుగుల అజేయ ప్రళయం.
- శ్రీనివాస్ దాస్ మంతటి
విరాట్ కోహ్లి అంతర్జాతీయ అరంగ్రేటం 2008లో జరిగింది. శ్రీలంకపై దంబుల్లా వన్డేలో విరాట్ కోహ్లి ప్రయాణం మొదలైంది. జట్టులో మూడేండ్లుగా కొనసాగుతున్నా, ఎనిమిది శతకాలు సాధించినా విరాట్ కోహ్లి కెరీర్‌ను మలుపు తిప్పలేదు. 2011 వరల్డ్‌కప్ నెగ్గిన జట్టులో కోహ్లి సభ్యుడు. దిగ్గజాలు వీడ్కోలుకు సిద్ధమవుతున్న తరుణంలో దిగ్గజ వారసత్వ పరంపర కొనసాగిస్తున్నానే సందేశం పంపేందుకు కోహ్లికి మరో ఏడాది పట్టింది. 2012 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా, శ్రీలంకతో భారత్ ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆడింది. ఆస్ట్రేలియా అప్పటికే ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో ప్రవేశానికి ఆశలు సజీవంగా నిలుపుకునేందుకు చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సహా బోనస్ పాయింట్ సాధించాలి. లేదంటే శ్రీలంక నేరుగా ఫైనల్లోకి అడుగుపెట్టనుంది. దీంతో ఆ మ్యాచ్‌ను టీమ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 320/4 పరుగులు చేసింది. తిలకరత్నె దిల్షాన్ (160), కుమార సంగక్కర (105) శతకాలతో శ్రీలంకను పటిష్ట స్థితిలో నిలిపారు.
అద్భుతమే జరగాలి..!
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో విజయానికి భారత్ 50 ఓవర్లలో 321 పరుగులు చేయాలి. కామన్‌వెల్త్ బ్యాంక్ సిరీస్ ఫైనల్స్ ఆశలు సజీవంగా నిలవాలంటే 40 ఓవర్లలోనే 321 పరుగులు చేయాలి. ఇదీ సమీకరణం. 300 పైచిలుకు లక్ష్యాలను టీమ్ ఇండియా పలుమార్లు విజయవంతంగా ఛేదించింది. ఆ లక్ష్యం కొత్త పరీక్ష కాదు. కానీ 40 ఓవర్లనే 321 పరుగులు కొట్టడం మాత్రం కచ్చితంగా గతంలో ఎన్నడూ చేయని సాహాసం!. ఛేదనలో విధ్వంసకారుడు వీరెందర్ సెహ్వాగ్ (30), మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (39) ఇద్దరూ పెవిలియన్‌కు చేరుకున్నారు. ఢిల్లీ బార్సు గౌతం గంభీర్, విరాట్ కోహ్లి భాగస్వామ్యం భారత్ విజయంపై కన్నేసేలా చేసింది. కానీ కంగారూ పరిస్థితుల్లో 300 ప్లస్ పరుగుల ఛేదనకు ఆ భాగస్వామ్యం సరిపోదు. సిరీస్‌లో భారత్‌ను సజీవంగా నిలిచేందుకు ఓ అద్భుతం చోటుచేసుకోవాలి. విరాట్ కోహ్లి అదే చేశాడు. నిజంగానే అది అద్భుతం!!.
విధ్వంసమే ఆయుధం :
తొలి బంతినే లెగ్ ఫ్లిక్‌తో పరుగులు పిండుకున్న కోహ్లి ఎక్కడా తడబడలేదు. స్కేర్‌లెగ్ దిశగా చూడచక్కని స్ట్రోక్‌తో మ్యాజిక్ మొదలెట్టాడు. 17 పరుగుల వద్ద ఉండగా కోహ్లి బ్యాట్ నుంచి కవర్ డ్రైవ్ వచ్చింది. క్రికెట్ చూసిన కండ్లుచెదిరే కవర్ డ్రైవ్‌లలో అదొకటి. ఆ షాట్ ఛేదన గమనాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లి కవర్ డ్రైవ్‌తో వ్యాఖ్యాతలు సైతం మైమరిచిపోయారు. ' అదీ స్ట్రోక్. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా కొట్టగలరా..!!!' అంటూ కోహ్లి కవర్ డ్రైవ్‌ను పొగిడేందుకు పదాలు వెతుక్కున్నారు. అది అక్కడితో ఆగిపోలేదు. బంతి గుంజి కొట్టకొట్టడంలో క్లాసికల్ షాట్‌ను చూపించాడు కోహ్లి. క్లాసికల్ స్లాగ్ షాట్‌తో సిక్సర్ సంధించిన కోహ్లి..వరుస బౌండరీలు సాధించాడు. వరల్డ్ క్రికెట్ మ్యాజిక్ పేసర్ లసిత్ మలింగ భరతం పట్టాడా మ్యాచ్‌లో. కోహ్లి దూకుడుతో లంక కెప్టెన్ మహేళ జయవర్ధనె కొంతసేపు మలింగను పక్కనపెట్టాల్సి వచ్చింది. అయినా, విరాట్ వీరోచితానికి విరామం ఇవ్వలేదు. విరాట్ కోహ్లి నుంచి మరిన్ని సొగసైన ఫ్లిక్‌లు, గ్లింప్స్ రాసాగాయి. మ్యాచ్ స్కిప్ట్ తన చేతుల్లో ఉన్నట్టు సాగింది కోహ్లి బ్యాటింగ్. ఆ రోజు అతడిని ఆపగలే శక్తి లేదు అనిపించింది. గౌతం గంభీర్‌తో విరాట్ కోహ్లి 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 64 బంతుల్లో 63 పరుగులు చేసిన గంభీర్ రనౌట్‌గా నిష్క్రమించాడు.
షార్ట్ పిచ్ బంతుల బలహీనత కలిగిన మరో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ సురేష్ రైనా తోడయ్యాడు. స్కోరు 27.3 ఓవర్లలో 201/3. మరో 12.3 ఓవర్లలో 120 పరుగులు చేయాలి. ఓ వైపు విరాట్ విధ్వంసం కొనసాగుతున్నా భారత్ ఫైనల్ ఆశలు నెమ్మదిగా ఆవిరి అవుతున్నాయి. ఆ స్థితిలో భారత్ కోల్పోయేందుకు ఏమీ లేదనే భావన ఇద్దరిలో మొదలైనట్టు అనిపించింది. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లి తన ఇన్నింగ్స్‌ను ఒక్కసారిగా టాప్‌గేర్‌లోకి తీసుకెళ్లాడు. ఒత్తిడిలో మరింత చెలరేగే స్వభావం బహుశా విరాట్‌కు ఈ మ్యాచ్ నుంచే అలవడి ఉంటుంది. 76 బంతుల్లో 100 పరుగుల మార్క్ పూర్తి చేసిన విరాట్ కోహ్లి, తర్వాత ఎదుర్కొన్న పది బంతుల్లోనే 33 పరుగులు పిండుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్య లసిత్ మలింగను ఆ మ్యాచ్‌లో ఉతికారేశాడు కోహ్లి. అతడేసిన ఓ ఓవర్లో ఏకంగా 24 పరుగులు (2, 6, 4, 4, 4, 4) పిండుకున్నాడు. విరాట్ విధ్వంసానికి మలింగ 7.4 ఓవర్లలోనే 96 పరుగులు సమర్పించుకున్నాడు.
నవ శకానికి నాంది :
300 బంతుల్లో 321 పరుగులు చేయటమే గొప్పగా భావించే సమయంలో 220 బంతుల్లోనే 321 పరుగుల లక్ష్యం ఛేదించటం అద్భుతమే. ఆఖర్లో సురేష్ రైనా (40) తోడుగా విరాట్ కోహ్లి ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. 36.4 ఓవర్లలోనే భారత్ 321 పరుగులను ఊదేసింది. విరాట్ కోహ్లి 86 బంతుల్లో 133 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అప్పట్నుంచి విరాట్ కోహ్లి శైలి పూర్తిగా మారిపోయింది. అక్కడ్నుంచి భారత్ విజయ వ్యూహం మారిపోయింది, లక్ష్యాలను సులువుగా ఛేదించే ప్రస్థానం ప్రారంభించింది. విరాట్ కోహ్లి ఆటలో ప్రతి అవకాశాన్ని గొప్పగా వాడుకున్నాడు. పరుగుల దాహంలో ఎక్కడా సంతృప్తి పడలేదు. సవాళ్లను ఎదుర్కొవడాన్నే అమితంగా ఇష్టపడే తత్వమే విరాట్ కోహ్లిని ఆధునిక క్రికెట్‌లో మేటి బ్యాట్స్‌మన్‌గా నిలిపాయి.
హౌబర్ట్ విధ్వంసం నాకు ఇంకా గుర్తుంది. మ్యాచ్‌ను తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో విరాట్ ఎన్నో శతకాలు సాధించాడు. కానీ శ్రీలంకపై హౌబర్ట్‌లో ఆడిన ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకం. అప్పటికి కోహ్లి ఇంకా కుర్రాడే. కోహ్లి క్రీజులో ఉండగా మలింగ భిన్నమైన బౌలర్‌గా కనిపించటం నేను చూశాను. క్రికెట్ ఛేదనల్లోనే విరాట్ కోహ్లి హౌబర్ట్ విధ్వంసం ఎప్పటికీ శిఖర సమానం'
- సౌరవ్ గంగూలీ, భారత మాజీ కెప్టెన్