Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారత మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్
ముంబయి : కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి రాకపోయినా, లాక్‌డౌన్ 4.0లో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. 54 రోజుల కఠిన లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో జనజీవనం సాధారణ స్థితికి వచ్చేసింది. కరోనా వైరస్‌తో కలిసి జీవించేందుకు సమాజం సరైన దిశగా సన్నద్ధమైనదా? లేదా అనేది మరో చర్చ!. లాక్‌డౌన్ సడలింపులతో భారత్‌లో క్రీడా స్టేడియాలు, క్రీడా సముదాయాలను అనుమతి లభించింది. చాలా రాష్ట్రాల్లో క్రీడాకారులు అవుట్‌డోర్ శిక్షణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్2020 నిర్వహణపై ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించే అవకాశం కనిపించటం లేదు. దీంతో ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్ ప్రేక్షకులు లేని స్టేడియంలో ఆడేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన క్రికెట్ సీజన్‌ను ఐపీఎల్2020తో పున ప్రారంభించాలనే డిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఆ జాబితాలో భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ చేరారు.
' ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై నాకు అనుమానం ఉంది. ఐపీఎల్ గురించి ఇప్పుడే ఆలోచన చేయలేం. అది పూర్తిగా భారత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. టీ20 వరల్డ్‌కప్ వాయిదా/ రద్దు అయితే అక్టోబర్-నవంబర్‌లో ఐపీఎల్‌కు అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ తర్వాత క్రికెట్ సైతం మారనుంది. ప్రేక్షకులు లేకుండా ఆడటం క్రికెట్‌కు పూర్తిగా కొత్త. ఖాళీ స్టేడియాల్లో మునుపెన్నడూ ఆడలేదు. క్రికెట్ ఆరంభానికి మరో 3-4 నెలల సమయం పడుతుంది. మైదానంలో నిలిచిన క్రికెటర్లలో కచ్చితంగా కరోనా భయం ఉంటుంది. ఈ పరిస్థితులు ఎదుర్కొవటం అంత సులువు కాదు' అని అన్షుమన్ గైక్వాడ్ అన్నాడు.