Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోహాన్స్‌బర్గ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసీసీ) అధ్యక్ష పదవికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే సరైనోడని, తన ఓటు అతనికేనని దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ తిరిగి ప్రారంభం కానున్న ప్రస్తుత పరిస్థితుల్లో గంగూలీ ఐసీసీ అధ్యక్షునిగా ఎంపికైతే సరైన వ్యక్తి అధ్యక్ష పీఠంపై కూర్చున్నట్లవుతుందన్నాడు. ఐసీసీ అధ్యక్ష బరిలో గంగూలీ నిలవడం మంచి నిర్ణయమనీ, ఆ పదవిని అలంకరిస్తే మాత్రం సరైన వ్యక్తికే బాధ్యతలు అప్పగించినట్లవుతుందని ఓ మీడియాతో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ స్మిత్ తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ పర్యటనలకు వెళ్లే ముందు, తర్వాత ఆటగాళ్లకు 14 రోజుల క్వారంటైన్ మంచి నిర్ణయమేమనన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎప్పుడూ బీసీసీఐతో మంచి సంబంధాలనే కలిగి ఉన్నదనీ, 'ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్'(ఎఫ్‌టీపీ)కు గట్టి పునాది వేసేది గంగూలీనేనని తెలిపాడు. సఫారీ బోర్డు బలపడడానికి గంగూలీ సాయం చేస్తానని తెలిపాడని, తన ఓటు మాత్రం గంగూలీకేనని స్మిత్ తెలిపాడు. బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న గంగూలీ పదవీకాలం జులైతో ముగియనుంది. ఐసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న శశాంక్ మనోహర్ పదవీకాలం మే నెలాఖరుతో ముగియనుంది. గత ఏడాది డిసెంబర్‌లోనే మనోహర్ పదవీకాలం ముగిసినా.. కోవిడ్-19 కారణంగా ఐసీసీ ఆరు నెలలు శశాంక్ పదవీకాలాన్ని పొడిగించిన విషయం తెలిసిందే.