Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఆర్‌టీ మందులకు దూరంగా రోగులు
- అంచనాకు తగినట్టు లేని రిజిస్ట్రేషన్
- నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తున్నది. గతంలో కన్నా కేసుల సంఖ్య తగ్గడంతో ఈ వ్యాధి నియంత్రణ పట్ల శ్రద్ధ ప్రశ్నార్థకమవుతున్నది. వ్యాధి సోకిన వారంతా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవడం లేదని తెలిసింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ప్రతి రెండేండ్లకు ఒకసారి వ్యాధి వ్యాప్తిని అంచనా వేసేందుకు చేపట్టిన సర్వేతో వేసిన అంచనాలకు, ప్రస్తుతం నమోదు చేసుకున్న రోగుల సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉండడం భయాందోళన కలిగిస్తున్నది. సర్వే అంచనాల ప్రకారం రాష్ట్రంలో 1,58,000 మంది రోగులుండాలి. అయితే ప్రస్తుతం రాష్ట్ర మండలి వద్ద కేవలం ఒక లక్షా 12 వేల మంది రోగులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలోనూ కేవలం 80,645 వేల మంది మాత్రమే యాంటీ రిట్రో వైరల్ (ఏఆర్‌టీ) మందులను క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. మరో 25 వేల మంది మందులను రెగ్యులర్ గా తీసుకోకపోగా, వారిలో చాలా మట్టుకు తప్పుడు చిరునామాలు ఇవ్వడంతో వారిని వెతకడం ఇబ్బందికరంగా మారింది. అంచనాలు, నమోదు చేసుకున్న వారిలో మందులు తీసుకోని వారిని కలుపుకుంటే దాదాపు 50 వేల మంది వ్యాధిగ్రస్తులపై పర్యవేక్షణ కరువైంది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి వ్యాధిని పూర్తిగా నియంత్రించేందుకు రాష్ట్రంలో 53 స్వచ్ఛంద సంస్థల సహకారంతో కలిసి పని చేస్తున్నది. హైస్కూలు స్థాయిలో రెడ్ రిబ్బన్ క్లబ్బులు, ఆ పై చదువులు చదుతున్న విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు నెహ్రూ యువ కేంద్రతో అవగాహన చేసుకుని కార్యక్రమాలు చేపడుతు న్నది. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు పాఠశాల లు మూతపడడంతో ఈ కార్యక్రమాలకు అంతరా యం కలిగింది. అయితే ప్రత్యామ్నాయ ప్రచార కార్యక్రమాలకు కూడా చేపట్టే వీలు లేకపో వడంతో ఆన్ లైన్ ద్వారా మమ అనిపించినట్టు విమర్శలు వస్తున్నాయి. ఇక స్వచ్ఛంద సేవా సంస్థలకు గతంలో నిర్ణయించిన మేరకే నిధులు ఇస్తుండడంతో మెరుగ్గా సేవలందించలేకపోతు న్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు, హైవేలపై ట్రక్కు డ్రైవర్లకు సురక్షింత లైంగిక పద్ధతులపై అవగాహన కల్పించడంలో ఎన్జీవోల పాత్ర కీలకం. అంటే రిస్క్ గ్రూపును గుర్తించడం, వారిలో అవగాహన పెంచడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకట్ట వేస్తు న్నారు. చివరిసారిగా వేసిన అంచనా ప్రకారం రాష్ట్రంలో ప్రతి 10 వేల మందిలో 49 పాజిటివ్ కేసులున్నాయి. అయితే ఆ స్థాయిలో కేసులు పరీక్షల్లో బయటపడకపోడం తో రోగం ముదరడమే కాకుండా ఇతరులకు వ్యాపించే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పరీక్షలు చేయించుకోవాలి
రాష్ట్రంలో తమకు వ్యాధి ఉందని తెలిసి మందులు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారే కాకుండా మరో 25 వేల మందికి పైగా తాము హెచ్‌ఐవీ బారిన పడిన సంగతి కూడా తెలియని వారుంటారని అంచనా. సురక్షిత పద్దతులు పాటించకుండా లైంగిక చర్యల్లో పాల్గొన్న వారిలో ఏమి కాదులే అనే నిర్లక్ష్య ధోరణి, పరీక్షలకు వెళితే అందరికి తెలుస్తుందనే భయం కూడా రోగులు బయటపడకపోవడానికి కారణమని ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే ప్రారంభదశలో గుర్తిస్తే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందనీ, వెంటనే మందులను వాడడం మొదలు పెడితే హెచ్‌ఐవీ ముదిరి ఎయిడ్స్‌గా మారకుండా ఆపవచ్చని సూచిస్తున్నారు. అనుమానం ఉన్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.