Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఆందోళనకు మద్దతుగా 3వ తేదీన నిరసనలు: వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
'దేశ రాజధాని ఢిల్లీలో లక్షలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్నా.. మీకు పట్టదా.. ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడా లేదు.. రైతుల గోస పట్టని మోడీ ప్రభుత్వానికి దేశాన్ని పాలించే అర్హత లేదు' అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ విహార్‌లో రెండు రోజులుగా సాగుతున్న వ్యకాస రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీని చుట్టుముట్టి రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు మద్దతుగా సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 3న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేని రైతులు నిరసన తెలపడానికి వస్తే వారిపై బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీచార్జి చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మోడీ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ అనేక రకాలైన కార్మిక చట్టాలకు సవరించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొ రేట్లకు కట్టబెట్టేందుకే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారని స్పష్టంగా అర్థమవుతుం దన్నారు. నిత్యావసర వస్తువుల నియంత్రణ, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టానికి అధిక నిధులు కేటాయించాలనీ, కూలీలకు 200 రోజుల పాటు పని కల్పించి రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొను గోలు చేయాలనీ, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని కోరారు. ఆహార భద్రత చట్టాన్ని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసి నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యకాస కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, మచ్చా వెంకటేశ్వర్లు, నాయకులు కొండమడుగు నర్సింహ, ములకలపల్లి రాములు, బొజ్జ చిన్న వెంకులు, కంబాలపల్లి ఆనంద్, దండంపల్లి సరోజ, కత్తుల లింగస్వామి, రవినాయక్, నాగిరెడ్డి, మన్నె బిక్షం, నరేష్, కందుల సైదులు పాల్గొన్నారు.