Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాంతీయ పార్టీల ఐక్యతతోనే బీజేపీకి కళ్లెం
- కడుపు కాలిన ప్రజలు ఉద్యమించక తప్పదు
- జిల్లాలో పార్టీకి పూర్వవైభవాన్ని తేవడమే వనగంటి ఈశ్వర్‌కు నిజమైన నివాళి:సీపీఐ(ఎం) ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి వనగంటి ఈశ్వర్
- సంస్మరణ సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, మధు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఆర్థిక పోరాటాలే మతోన్మాద విచ్ఛిన్న వాదాలకు విరుగుడనీ, బీజేపీకి కళ్లెం వేయాలంటే ప్రాంతీయ పార్టీల ఐక్యతతోనే సాధ్యమని సీపీఐ(ఎం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, పి. మధు అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సీపీఐ(ఎం) మాజీ జిల్లా కార్యదర్శి వనగంటి ఈశ్వర్ సంస్మరణ సభ వనపర్తి జిల్లా కేంద్రంలోని రాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించారు. ముందుగా ఈశ్వర్ చిత్రపటానికి తమ్మినేని, మధు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో సీపీఐ(ఎం) వ్యాప్తి కోసం వనగంటి ఈశ్వర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. పూటకో పార్టీ మారి సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్న ఈ తరుణంలో ఎలాంటి స్వార్థప్రయోజనాలు ఆశించకుండా 23ఏండ్లు పార్టీ జిల్లా కార్యదర్శిగా అందరినీ ఏకతాటిపైకి తెచ్చి పని చేయించడం మామూలు విషయం కాదని తెలిపారు. ఎక్కడా ప్రజా పునాది లేని బీజేపీ సెంటిమెంట్‌ను ఆసరా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. నేడు జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ ఒక అడుగు ముందుకేసి తమ పార్టీ హిందువులదేనని చెప్పడం లౌకికతత్వానికి గొడ్డలిపెట్టన్నారు. బీజేపీ, ఎంఐఎం ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించడం తప్ప ప్రధాన రాజకీయ పార్టీలేవీ ప్రజా సమస్యలపై ఆలోచించిందేలేదన్నారు. రైతు వ్యతిరేక బిల్లులు రద్దు చేయాలని కోరుతూ పంజాబ్ ప్రజలు ఢిల్లీ నగరాన్ని ముట్టడి చేయడం చూస్తుంటే బిల్లుల పట్ల వ్యతిరేకత ఏ విధంగా ఉందో తెలుస్తోందన్నారు. ఆర్థిక సమస్యలు తీవ్రమైనప్పుడు వర్గ పోరాటాలు తప్పవనీ, రైతుల పోరాటమే దానికి నిదర్శనమని తెలిపారు. దశాబ్దాల తరబడి ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన ఈశ్వర్ బాటలో పార్టీ అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
ప్రాంతీయ పార్టీల ఐక్యతతోనే బీజేపీకి కళ్లెం : పి. మధు
ప్రాంతీయ పార్టీల ఐక్యతతోనే కేంద్రంలోని బీజేపీకి కళ్లెం వేయొచ్చని ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుంటే నక్సల్స్ మూకుమ్మడి దాడులు చేసినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాలను ముందుకు నడిపిన ఘనత ఈశ్వర్‌కు దక్కుతుందని తెలిపారు. మళ్లీ జిల్లాకు పూర్వ వైభవం తీసుకురావడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. తూముకుంటలో పేదల భూములను భూస్వాములు ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన చరిత్ర ఇంకా కండ్ల ముందు కదలాడుతుందన్నారు. ఎన్ని దాడులు చేసినా ఎత్తిన జెండా దించకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. దేశంలో ఏ పార్టీ గెలిచిన రైతుల మౌలిక పరిస్థితులు మాత్రం మారడం లేదనీ, అందుకే ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట రైతు ఆగ్రహ జ్వాలలు వెలువడుతూనే ఉన్నాయన్నారు. పాలక పార్టీలు సమస్యల పరిష్కారంలో విఫలమై ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తే కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.
సభలో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, డాక్టర్ మురళి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కిల్లే గోపాల్, మాజీ కౌన్సిలర్ నాగేశ్వర్, సీపీఐ(ఎం) వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల కార్యదర్శులు ఎండీ.జబ్బార్, వర్ధం పర్వతాలు, వెంకట్రా మిరెడ్డి, ఎ.రాములు, వెంకటస్వామి, కందికొండ గీత, లక్ష్మి, కురుమయ్య, పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎంఎల్) నాయకులు అరుణ్ కుమార్, చంద్రయ్య పాల్గొన్నారు.