Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంలోని బీజేపీ సర్కారువన్నీ వంచించే మాటలే : ఏఐకేఎస్‌సీసీ ధర్నాలో వామపక్ష నేతలు
- నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాల్సిందే స్వామినాథన్ సిఫారసులు, ఎమ్‌ఎస్‌పీ అమలేదీ..?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కారుపై రైతులు తమ పోరాటంతో యుద్ధం ప్రకటించారనీ, నూతన వ్యవసాయక, విద్యుత్ సవరణ చట్టాలను రద్దుచేయకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని వామపక్ష నేతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను వంచించే మాటలను విడనాడి స్వామినాథన్ కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటం దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నదన్నారు. ఢిల్లీ, హర్యానాలలో రైతులపై పాలక వర్గం చేయిస్తున్న దాడులకు నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో ధర్నాను సోమవారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేందుకు మన దేశాన్ని ప్రధాని మోడీ ఒక ప్రయోగశాలగా మార్చారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో పేదల బతుకులను ఛిద్రం చేశారనీ, జీఎస్టీతో రాష్ట్రాల హక్కులను హరించారని చెప్పారు. నూతన వ్యవసాయక చట్టాలు రైతులను ఆత్మహత్యల వైపు నెట్టేలా ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చారు. గతంలో ఉన్న పాలేరు, జీతగాళ్ల వ్యవస్థను మోడీ సర్కారు మళ్లీ తేబోతున్నదని విమర్శించారు. స్వేచ్ఛావాణిజ్యం పేరుతో రైతులను, వ్యవసాయ అనుబంధరంగాలపై ఆధారపడి బతికేవారిని నట్టేట ముచ్చుతున్నదన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ రద్దు సామాన్యులకు తీరని నష్టమన్నారు. మోడీ సర్కారు ప్రశ్నించేవారిపై దాడులకు పాల్పడుతున్నదనీ, పౌరహక్కులకు భంగం కలిగిస్తున్నదని విమర్శించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రైతులు తమ పోరాటాన్ని ఆపొద్దని కోరారు. వ్యవసాయ సంక్షోభాన్ని గటెక్కిస్తాం...మద్దతు ధర కట్టిస్తాం..అతివృష్టి, అనావృష్టివల్ల నష్టపోయే రైతులను పంటలబీమాతో ఆదుకుంటామని చెప్పి గద్దెనెక్కిన మోడీ సర్కారు నేడు వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని విమర్శించారు. మోడీ సర్కారు వచ్చాక మద్దతు ధర దక్కక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయనీ, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో ప్రతిరోజూ రైతులు ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలన్నీ దేశప్రజానీకానికి నష్టం చేకూర్చేయన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, ఆదివాసీ, గిరిజన సంఘం నేత బండారు రవి, ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, ప్రజాసంఘాల నాయకులు బాలరాజు, బోస్(ఏఐటీయూసీ), ఎం.శ్రీనివాస్(ఐఎఫ్‌టీయూ), ఎస్‌ఎల్ పద్మ(ఐఎఫ్‌టీయూ), ఎస్.రమ, వంగూరి రాములు(సీఐటీయూ), సంధ్య(పీఓడబ్ల్యూ), రాయల రమ, జ్యోతి (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ), స్కైలాబ్‌బాబు(కేవీపీఎస్), శోభన్ (తెలంగాణ రైతు సంఘం), నాగరాజు(ఎస్‌ఎఫ్‌ఐ), నాగేశ్వర్‌రావు(పీడీఎస్‌యూ), రవీందర్( వృత్తిదారుల సంఘం), అనిల్, వలిఉల్లాఖాద్రి(ఏఐవైఎఫ్), తదితరులు పాల్గొన్నారు.