Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించండి:అధికారులకు మంత్రి సబిత ఆదేశం
- 18న సంక్షేమ మంత్రులు, అధికారులతో సమావేశం
- 19న ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో భేటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని సంబంధిత అధికారులను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. వచ్చేనెల ఒకటి నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం హైదరాబాద్‌లో విద్యాశాఖ అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, ప్రయివేటు యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ఈనెల 25వ తేదీ నాటికి సిద్ధం కావాలని కోరారు. 9,10, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి ఏ విధంగా నిర్వహించాలనే విషయంలో తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఈనెల 20లోగా ప్రభుత్వానికి అందించాలని సూచించారు. విద్యాసంస్థలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లోని పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించామని గుర్తు చేశారు. జిల్లాలోని విద్యాసంస్థల పూర్తిస్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్ల ద్వారా రూపొందించాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు సమకూరుస్తారని తెలిపారు. విద్యాశాఖాధికారులు ప్రత్యేకంగా అన్ని పాఠశాలలనూ ప్రత్యక్షంగా పరిశీలించి పాఠశాలలన ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కోరారు. వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈనెల 18న ఆయా సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయివేటు విద్యాసంస్థలు నడుచుకునే విధంగా ఈనెల 19న ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, వృత్తివిద్యా కోర్సుల యాజమాన్య కమిటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సన్నద్ధం చేస్తామని తెలిపారు. 9,10, ఇంటర్, డిగ్రీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి ఈ విద్యాసంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనా తదితరులు పాల్గొన్నారు.