Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణించిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కల్తీకల్లు, మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టా లని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల వికారా బాద్ జిల్లాలో కల్తీకల్లుకు ఇప్పటికే ముగ్గురుమృతి చెందారనీ, వందలాది మంది ఆస్పత్రులపాలు కావడం ఆందోళన కలిగిస్తున్నదని మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఇది పేద కుటుంబాలతో చెలగాటమాడడమేనని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.
మాదకద్రవ్యాల ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ విలసిల్లుతుందనే ఆరోపణతోపాటు, అటవీ ప్రాంతాల్లో గంజాయిని సేద్యం చేసి పట్టణాలకు తరలిస్తూ యువతను మత్తులో ఉంచే ప్రయత్నం జరుగుతున్నదన్న వార్తలు ఇప్పటికే వస్తున్నాయని తమ్మినేని వీరభద్రం తెలిపారు. దీనికి తోడు కల్తీ వ్యాపారులు మాదకద్రవ్యాలతో కల్లును తయారు చేసి పేదల ప్రాణాలు బలితీసుకుంటున్నారని విమర్శించారు. పొద్దంతా పనిచేసే పేదలు ఉపశమనం కోసం తక్కువ ధరకు దొరికే కల్లు తాగే అలవాటున్నదని వివరించారు. దీన్ని అలుసుగా తీసుకుని డబ్బే సంపాదనగా కల్తీ వ్యాపారులు విచ్చలవిడిగా చెలరేగుతున్నారని పేర్కొన్నారు. మామూళ్ళకు అలవాటు పడ్డ ఎక్సైజ్ అధికారులు దీన్ని చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట ప్రాంతంలో తాటి, ఈతచెట్లు లేకున్నా హైడ్రోక్లోరైడ్‌తో కల్తీకల్లును తయ్యారు చేసి ముగ్గురి ప్రాణాలు బలితీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వందలాది మంది అనారోగ్యాలతో ఆస్పత్రుల పాలయ్యారని తెలిపారు. కల్తీకల్లుతోనే ఇది జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తేల్చారని గుర్తు చేశారు. ఇదే తంతు కొనసాగితే పేద కుటుంబాలు రోడ్డున పడతాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్‌శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరచి కల్తీకల్లు, మాదకద్రవ్యాల ఉత్పత్తి సరఫరాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
నేడు ఎస్వీకేలో వందేండ్ల కమ్యూనిస్టు ఉద్యమ గ్రంథాల పుస్తక ప్రదర్శన : ప్రారంభించనున్న తమ్మినేని
వందేండ్ల కమ్యూనిస్టు ఉద్యమ గ్రంథాల పుస్తక ప్రదర్శన బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న నవతెలంగాణ పుస్తకశాలలో జరగనుంది. ఈ ప్రదర్శనను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభిస్తారని నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ జనరల్ మేనేజర్ కె చంద్రమోహన్ మంగళవారం ఒ ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనకు వామపక్ష ఉద్యమ కార్యకర్తలు-విద్యార్థి-మహిళా-శ్రామిక-కార్మికవర్గం వచ్చి జయప్రదం చేయాలని కోరారు.