Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- ఇంటింటికీ ఫ్రీ నల్లా, బిల్లుల పంపిణీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ వాసులకు ఇక తాగునీటి కష్టాలు ఏమాత్రమూ ఉండబోవని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బొరబండలోని ఎస్బీఆర్‌మిల్స్, రెహ్మత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్ హిల్స్‌లో ఉచిత తాగునీటి పథకాన్ని ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రెహమత్ నగర్‌లో కేటీఆర్ ఇంటింటికీ తిరిగి జీరో నీటి బిల్లులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు రెండ్రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చిందన్నారు. దేశంలోని ఇతర మెట్రో
నగరాల్లో నీటి కొరత అధికంగా ఉందన్నారు. చెన్నై నగరంలో తాగునీటిని రైళ్లల్లో తరలిస్తున్న దుస్థితి ఉందని, మన హైదరాబాద్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదని, ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించేందుకు జలమండలి సుదూర ప్రాంతంలో ఉన్న గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని తరలిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా కేశవాపురం ప్రాజెక్టుతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 'రింగ్ మెయిన్ ప్రాజెక్టు' చేపట్టామన్నారు. దాంతో 2050 వరకు తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని తెలిపారు. తాను చదువుకునే రోజుల్లో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు జలమండలి ముందు ధర్నా చేసేవారిని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించుకున్నామన్నారు. గ్రేటర్ హైద్రాబాద్‌లో 10 లక్షల 8 వేల నల్లా కనెక్షన్లకు ఉచితంగా తాగునీరును అందిస్తున్నామన్నారు. ఈ పథకంతో గ్రేటర్‌లో 97 శాతం మందికి లబ్ది చేకూరిందన్నారు. దీంతో నెలకు రూ.19 కోట్ల 92 లక్షల ఆదాయాన్ని జలమండలి కోల్పోనుందన్నారు. ఉచిత తాగు నీరు కావాలంటే మార్చి 31లోపు మీటర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. మురికి వాడలు, బస్తీల్లో నివాసముంటున్న వారికి మీటర్ అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని, అలీ, మల్లారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసిఉద్దీన్, ఎమ్మెల్యేలు మాగంటి, దానం, ముఠా గోపాల్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు.