Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగుతల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం తొక్కి పెడుతున్నదని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దళితులకు భూములివ్వకపోగా, కేసీఆర్ ఉన్న భూములను లాక్కొని మైహోం రామేశ్వరరావుకు కట్టపెడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బడా కాంట్రాక్టర్ మెగా కష్టారెడ్డికి ప్రభుత్వఖజానా అప్పగిస్తున్నారని ఆరోపించారు. సామజిక న్యాయం జరగాలంటే దళితులు ఆర్ధికంగా బలపడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులు ముంజగాళ్ల విజరుకుమార్,నరేష్, కాటూరి రమేష్, శంకరప్పా, ధనరాజ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.