Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్టేట్ పోలీస్ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లయింట్స్ అథారిటీలకు చైర్మెన్, సభ్యుల నియామకాలు నాలుగు వారాల్లోగా చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించింది. కరోనా కారణంగా భర్తీకి మూడు నెలల సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ వినతిని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. చైర్మెన్, సభ్యుల నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం పేర్లను హైకోర్టుకు అందజేసిందనీ, కమిషన్‌కు సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తుల పేర్లు, అథారిటీ చైర్మెన్ పదవులకు జిల్లా రిటైర్డు జడ్జీల పేర్లు, సభ్యుల పేర్లను ప్రతిపాదించామనీ, వాటిని హైకోర్టు ఆమోదిస్తే నియామకాలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. తాము త్వరలోనే వాటిని పరిశీలించి తెలియజేస్తామనీ, ఆ తర్వాత నాలుగు వారాల్లోగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. ప్రకాష్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు 2017లో ఇచ్చిన తీర్పు ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు కమిషన్, అథారిటీలను నియమించలేదని అందిన లేఖను హైకోర్టు కోర్టు ధిక్కార పిటిషన్‌గా స్వీకరించి విచారణ జరుపుతోంది. విచారణ వాయిదా వేసింది.
మూడు పిల్స్ మాత్రమే విచారిస్తాం
22 కరోనా పిల్స్ పై విచారణ ముగించిన హైకోర్టు
కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినందున దీనికి చెందిన పాతిక పిల్స్‌లో ఒకే తరహాలోని మూడు పిల్స్‌ను మాత్రమే విచారిస్తామనీ, మిగిలిన వాటిపై విచారణ ముగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. రోజుకు నాలుగైదు వందల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, కరోనాను ప్రభుత్వం అదుపు చేసిందని, ఈ పరిస్థితుల్లో ఒకే తరహా అంశంపై పలు పిల్స్ విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రయివేటు ఆస్పత్రుల్లో 15 శాతం పడకలు దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు ఇవ్వాలనీ, ప్రయివేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజుల దోపిడీ చేస్తున్నారనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు కల్పించి సిబ్బందిని నియమించాలనీ, కరోనా టెస్టులు తగినన్ని చేయాలన్న పిల్స్‌ను మాత్రమే విచారిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. దిల్లీ లాంటి చిన్న రాష్ట్రంలో నిత్యం 40 వేల పరీక్షలు చేస్తుంటే తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రంలో 50 వేల పరీక్షలు చేయాలంటే కూడా ప్రభుత్వం చేయకుండా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. అధిక పరీక్షలు చేస్తే ప్రజలకు ఆరోగ్యపరంగా మేలు చేసినట్టు అవుతుందని అభిప్రాయపడింది. రాబోయే రెండు వారాల్లో చేయబోయే కరోనా పరీక్షలు,ఫలితాలు,యూకే నుంచి వచ్చిన కొత్త వైరస్ కేసులు,నివారణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం తరఫున ఎ.జి. బి.ఎస.్ ప్రసాద్‌ను ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది.