Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా 24మంది సీనియర్ అసిస్టెంట్లకు అవకాశం
- ఒకరికి డీటీసీ, నలుగురికి ఆర్టీవోలుగా కల్పించే అవకాశం
- ఆర్టీవోల డీపీసీ పూర్తి.. !
- జాబితా విడుదల చేసే అవకాశం
- రేపోమాపో డీపీసీ ముందుకు ఏవోల ప్రమోషన్ల ఫైల్!
నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణాశాఖలో మరోమారు ప్రమోషన్ల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రవాణాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఐదారేండ్లుగా పెండింగ్‌లో ఉంటూ వస్తున్న ప్రమోషన్ల ప్రక్రియను దశలవారీగా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 24 పరిపాలన అధికారుల(ఏవో) పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి ఏవోలుగా ఉద్యోగోన్నతి లభించనుంది. ఒక డీటీసీ, నాలుగు ఆర్టీవోల ప్రమోషన్లు కూడా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఆర్టీవోలకు సంబంధించిన డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) నిర్వహించినట్టు సమాచారం. ఈనెల 23 లేదా 25న పరిపాలన అధికారులకు సంబంధించిన డీపీసీ నిర్వహించనున్నారని తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖకు మొత్తం 46 పరిపాలన అధికారుల పోస్టులకు గానూ.. ప్రస్తుతం 22 మంది పనిచేస్తున్నారు. ఇంకా 24 ఖాళీలున్నాయి. ఇందులో ఒక్క గ్రేటర్‌లోనే 6ఖాళీలున్నాయి. ఇదిలావుంటే రాష్ట్రానికి రవాణాశాఖ ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం గ్రేటర్ నుంచే వస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట, బండ్లగూడ, మెహిదీపట్నం, శివారు ప్రాంతాల్లో అత్తాపూర్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీపట్నం ఆర్టీఏ కార్యాలయాలున్నాయి. వీటిల్లో 8మంది మాత్రమే ఏవోలు ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెయ్యికిపైగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, వెయ్యిలోపు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ జరుగుతోంది. దాంతో ఉద్యోగులపై అధిక పనిభారం పడుతోంది. పాలనాపరమైన ఇబ్బందులతోపాటు సిబ్బంది కొరతతో ఆర్టీఏ కార్యాలయాల్లో అందించే పౌరసేవల్లో తీవ్ర జాప్యం జరగుతోంది.
ఏఓ ప్రమోషన్లకు పోటీ ఎక్కువ..!
2015 తర్వాత మళ్లీ ఇప్పుడు ఏఓ ప్రమోషన్ల ప్రక్రియ జరగనుండగా.. సుమారు 200 మంది సీనియర్ అసిస్టెంట్లు ఏఓ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో నల్లగొండ డీటీసీ పోస్టుతో పాటు వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలంలో ఖాళీగా ఉన్న ఆర్టీవో పోస్టులనూ భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి డీపీసీ పూరైనట్టు సమాచారం. దీంతోపాటే 80 ఏఎంవీఐ పోస్టుల్లోనూ ప్రస్తుతం కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ.. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు సీనియారిటీ, అర్హత ఉంటే ఏఎంవీఐలుగా పదోన్నతి కల్పిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేసిన అధికారులు.. సీనియారిటీ ప్రకారంగా లిస్టును సిద్ధం చేశారు. ఎస్‌ఏలకు ఏవోలుగా ఉద్యోగోన్నతితోపాటు ఇతర ఖాళీ పోస్టుల్లోనూ ప్రమోషన్లతో భర్తీ చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడే ఖాళీలను గుర్తించి సదరు జాబితాను ప్రభుత్వానికి అందిస్తారు. తద్వారా నిరుద్యోగులకు అవకాశం లభించనుంది.