Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాప సభలో వామపక్ష నేతలు
- రైతాంగం తరహాలో కమ్యూనిస్టు ఉద్యమాలుండాలి : నారాయణ
- వామపక్ష పోరాటాలకు ప్రతీక : డీజీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధలు బూర్గుల నర్సింగ్‌రావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని వామపక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఉద్యమ నేతగా, రచయితగా, ప్రజాస్వామ్య, లౌకికవాదిగా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారని ఆయన సేలవను కొనియాడారు. స్వాతంత్య్రోద్యమంతోపాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న గొప్ప నాయకుడని అన్నారు. చివరి వరకూ మార్కిస్టు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆయన మరణం కమ్యూనిస్టు, వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటని అన్నారు. వామపక్ష పార్టీల ఐక్యతను సాధించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈనెల 18న కరోనాతో మరణించిన బూర్గుల నర్సింగ్‌రావు సంతాపసభ గురువారం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ వామపక్ష ఉద్యమానికి ప్రతిబింబం నర్సింగ్‌రావు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే, అందులో చేసిన వారూ కొట్టుకుపోతారని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీది అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. వామపక్షాలు, ప్రజాస్వామ్యవాదులను అణచివేసిన మమతను ఇప్పుడు మతతత్వ శక్తుల నుంచి కాపాడే వారే లేరన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రతిపక్షం ఉండకూడదని కేసీఆర్ భావించారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారని చెప్పారు.కమ్యూనిస్టులు ఉండకూడదని అనుకుంటే ఆయన ఉండరని అన్నారు. రైతాంగ ఉద్యమాల తరహాలో కమ్యూనిస్టులు ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు మాట్లాడుతూ బూర్గుల నర్సింగ్‌రావు వామపక్ష ఉద్యమాలకు ప్రతీకగా ఉన్నారని అన్నారు. ఆలం కుంద్‌మిరి, సీఎన్ చారి, దామోదరన్, సంజరుబారు, బూర్గుల నర్సింగ్‌రావుతో కలిపి ఇండియన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఏర్పాటైందని చెప్పారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, వామపక్షవాదిఅని అన్నారు. అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిమాట్లాడుతూ ఆశయాలు, ఆకాంక్షలు, భావాలు, లక్ష్యాలను నేటి తరాలకు తెలియజేసేందుకు ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రచురిస్తామని ప్రకటించారు. వామపక్షాల ఐక్యత దిశగా ఆలోచనలు, ప్రయత్నాలు, చర్చలు సాగుతున్నాయని చెప్పారు. సినీనటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ వామపక్ష పార్టీలన్నీ కలవాలనీ, పీడిత ప్రజల సమస్యలపై పోరాడాలని చెప్పారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ దోపిడీ లేని సోషలిస్టు వ్యవస్థ కోసం కృషి చేయాలని అన్నారు. రక్తసంబంధం కంటే వర్గసంబంధం గొప్పదని బూర్గుల నర్సింగ్‌రావు నిరూపించారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు జైని మల్లయ్యగుప్తా మాట్లాడుతూ దౌర్జన్యాలు చేసేవారు హిందువులైనా, ముస్లింలైనా ఒక్కటేననీ, వారికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, బూర్గుల నర్సింగ్‌రావు సోదరుడు బూర్గుల ప్రదీప్, కష్ణ (ఎంసిపిఐ(యు), గుర్రం విజరుకుమార్ (సీపీఐ(ఎంఎల్), డి రాజేశ్ (సీపీఐ(ఎంఎల్) లిబరేషన్), విమలక్క (అరుణోదయ సాంస్కతిక సమాఖ్య), గంగాధర్ (ఎస్‌యూసీఐసీ) తదితరులు ప్రసంగించారు. మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ ఎపి రాష్ట్ర నాయకులు పిజె చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంతాప సందేశాన్ని చాడ వెంకట్‌రెడ్డి చదివి వినిపించారు.