Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ బోయినిపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్‌సీఐ) సేవలను సద్వినియోగం చేసుకుంటామని తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, మేనేజర్లు, ఇంజనీర్లకు ఈఎస్‌సీఐలో శిక్షణ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఈఎస్‌సీఐని వినోద్‌కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, కాలుష్య నియంత్రణ మండలి, ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలతో ఈఎస్‌సీఐ భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల నైపుణ్యతను పెంచుకోవడానికి శిక్షణ అవసరమని తెలిపారు. ముఖ్యంగా స్కిల్ డవలప్‌మెంట్, వాతావరణ మార్పులు, రవాణా ఇంజనీరింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఈఎస్‌సీఐకే సాధ్యమని చెప్పారు. ఈఎస్‌సీఐలో ఆయా విభాగాలకు చెందిన హెచ్‌ఓడీల పనితీరును వినోద్‌కుమార్ అభినందించారు. అంతకుముందు ఈఎస్‌సీఐకి సంబంధించిన వివరాలను డైరెక్టర్ జి.రామేశ్వర్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.