Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ పునరాలోచించుకోవాలి
- అసెంబ్లీలో తీర్మానం చేయాలి
- సుప్రీం కోర్టు, కేంద్రం చెప్పినా చట్టాల రద్దే పరిష్కారం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న రైతాంగ పోరాటం స్వాతంత్ర పోరాటాన్ని మరిపించేలా కొనసాగుతున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. పోరాట స్ఫూర్తి దేశ రైతాంగాన్ని కదలిస్తున్నదన్నారు. చట్టాలు రద్దు చేయడమా? ప్రభుత్వం రద్దు కావడమో జరిగేదాకా ఢిల్లీ వదిలిపోబోమని రైతాంగం చెబుతున్నదని తెలిపారు. సుప్రీం కోర్టు చెప్పినా, కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా... చివరకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమూ, విద్యుత్ సవరణ బిల్లును ఉససంహరించుకోవడమే పరిష్కార మార్గమని సూచించారు. ఢిల్లీ రైతాంగ పోరాటానికి సంఘీభావంగా ఢిల్లీలో పర్యటించిన అనుభవాలను నవతెలంగాణ ప్రతినిధి గుడిగ రఘుతో పంచుకున్నారు.
ఢిల్లీలో రైతాంగ ఉద్యమం అనుభవాలేంటి? ఇంత కాలం కొనసాగడానికి కారణాలేంటి?
ఉద్యమం ఉధృతంగా కొనసాగడానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లులే కారణం. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు వీరోచితంగా పోరాడుతున్నారు. ఢిల్లీలోని ప్రధాన రహదారులను దిగ్బంధం చేశారు. సింఘు సరిహద్దు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. 55 రోజుల నుంచి ఐదు జాతీయ రహదారులు రైతుల కంట్రోల్ ఉన్నాయి. రైతుల క్యాంపులున్నాయి. లక్షలాది మంది పాల్గొంటున్నారు. పగలు ఉద్యమం. రాత్రిళ్లు తమ డెరాల్లో తిండి. అక్కడే టాయిలెట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వేలాది మంది ఉద్యమానికి ఆర్థికంగా సహకరిస్తున్నారు. భాషా, ప్రాంతాలు వేరైనా స్ఫూర్తి ఒక్కటే. చలికి తట్టుకుని, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెగించి పోరాటం చేస్తున్నారు. మాజీ సైనిక ఉద్యోగులు సైతం పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. ఎంత కాలామైనా పోరాటం కొనసాగిస్తాం. చట్టాలు రద్దు చేసేవరకు ఇక్కడే ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే వ్యవసాయానికి లాక్‌డౌన్ ప్రకటిస్తామని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ప్రకటనలు చేస్తున్నది? రైతుల పరిస్థితి ఏమిటి?
తొలుత ఈ చట్టాలను టీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. అందరూ సంతోషించారు. ఆ తర్వాత భారత్ బంద్‌లో పాల్గొన్నది. పోరాటాల్లోనూ నాయకులు పాల్గొన్నారు. దేేశమంతా తిరిగి అన్ని పార్టీలను కూడగడతానని కేసీఆర్ అన్నారు. చట్టాలు దుర్మార్గమన్నారు. రెండు రోజులకే ఢిల్లీకి వెళ్లి, మోడీ, అమిత్‌షాను కలిసి వచ్చి చట్టాలకు అనుకూలంగా మాట్లాడారు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదనీ, యాసంగి ధాన్యం కొనం, కొనుగోలు కేంద్రాలు ఉండవు అని ప్రకటించారు. ఈ నిర్ణయం రైతులకు అన్యాయం చేయడమే. కేసీఆర్‌కు ఏమాత్రం రైతుల యెడల సానుభూతి ఉన్నా...పునరాలోచించుకోవాలి. రెండు నాల్కల ధోరణి సరైందికాదు. రైతులకు ఈ చట్టాలతో నష్టం జరుగుతుంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసినట్టుగానే, తెలంగాణ అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలి.
ఒకవైపు సుప్రీం కోర్టు స్టేవిధించడం...మరోవైపు రైతాంగ ఉద్యమం కొనసాగడం, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం...ఇలాంటి పరిస్థితులు ఎక్కడికి దారి తీసే అవకాశముంది?
రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు చేయడం లేదు. మొక్కుబడిగా చేస్తున్నది. రైతుల డిమాండ్లపై మాట్లాడటం లేదు. కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నది. తాత్కాలికంగా స్టే ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చినప్పుడు అవి రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాయా? లేవా? అనేది పరిశీలించి తీర్పు ఇవ్వాలి. సుప్రీం కోర్టు బాధ్యత వహించడానికి పెద్ద మనుషులు కాదు కదా, ఏకపక్షంగా తీసుకొచ్చారనే కోర్టుకు పోయారు. వాటిని పరిశీలించి వాటిని రద్దు చేయాలి. కేంద్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కమిటీలోని ఆ నలుగురు చట్టాలను ఆమోదించిన వాళ్లే. అందులో ఒకాయన రాజీనామా చేశారు. చట్టాలు రద్దయ్యేవరకు పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. ప్రాణాలు పోతే తమ బిడ్డలు, తమ వారసులు కొసాగిస్తారని ధైర్యం చెబుతున్నారు.
చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో కదలిక ఉందా?
ఈ చట్టాల ప్రమాదం కొన్ని రాష్ట్రాలల్లో తొందరగా అర్థమైంది. తెలంగాణ రైతాంగానికీ అర్థమై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే బలమైన ఉద్యమాలవైపు రావడానికి ఇంకా వెనకబడుతున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వందలాది ట్రాక్టర్లతో ప్రదర్శన జరిగింది. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామనడంతో రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఒకటో తేదీ నుంచి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగుతున్నది. రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రైతు సంఘాలు కదిలాయి. రాజకీయ పార్టీలు కదలాల్సి ఉన్నది. వామపక్షాల పార్టీలు ఉద్యమం బాగా చేస్తున్నాయి.