Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 నెలలైనా అమలు కాని వైనం.. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే కాలయాపన
- సీల్డ్ కవర్‌ను తెరవని త్రిసభ్య కమిటీ
- ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలపై అస్పష్టత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ప్రకటిస్తుందా?అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో తొలి పీఆర్సీ ప్రకారం 2018, జులై 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అందుకోవాలి. కానీ 30 నెలలైనా పీఆర్సీని అమలు చేయకుండా కావాలనే సర్కార్ కాలయాపన చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈస్థాయిలో అలసత్వం ఎప్పుడూ జరగలేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గతంలో పాలకులతో కొట్లాడి పీఆర్సీని సాధించుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పుడు అది నెరవేర్చుకోలేకపోతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై యూఎస్‌పీసీ, జాక్టోలోని ఉపాధ్యాయ సంఘాలతోపాటు ఐక్యవేదికలోని ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే టీఎన్జీవో, టీజీవో నేతృత్వంలో జేఏసీ మాత్రం పోరాటాన్ని పక్కనపెట్టిందని ఉద్యోగులు మండిపడ్డారు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా పీఆర్సీ అమలులో అది కనిపించడం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘంగా పరిశీలించిన సిఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని పీఆర్సీ కమిటీ గతనెల 31న నివేదికను సీఎస్ సోమేశ్‌కుమార్‌కు అందజేసింది. కాగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. 22 రోజులైనా సీల్డ్‌కవర్‌లో ఉన్న ఆ నివేదికను తెరవలేదు. సంక్రాంతి కానుకగా పీఆర్సీ ప్రకటన వస్తుందని అందరూ అనుకున్నారు. అదీ నెరవేరలేదు. అసలు త్రిసభ్య కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతుందా?అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మూడు పీఆర్సీలు నష్టం...
సకాలంలో పీఆర్సీని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 14వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పొందేవారు. కానీ పాలకుల వైఖరి కారణంగా 11వ పీఆర్సీలోనే ఉండి పోవాల్సి వచ్చింది. అంటే మూడు పీఆర్సీలు నష్టపోయారన్న మాట. గతంలో కాంగ్రెస్, టీడీపీ, ఇప్పుడు టీఆర్‌ఎస్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా పీఆర్సీ సకాలంలో అమలు కాలేదు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. 8వ పీఆర్సీని 2003, జులై ఒకటి నుంచి అమలు చేయాలి. కానీ 2005, ఏప్రిల్ ఒకటి నుంచి 16 శాతం ఫిట్‌మెంట్‌తో ఆర్థిక ప్రయోజనాన్ని వర్తింపచేశారు. దీంతో ఉద్యోగులు 21 నెలలు పెరగాల్సిన వేతనాలు రాక నష్టపోయారు. 9వ పీఆర్సీని 2008, జులై ఒకటి నుంచి అమలు చేయాలి. కానీ 2010, ఫిబ్రవరి ఒకటి నుంచి 39 శాతం ఫిట్‌మెంట్‌తో ఆర్థిక ప్రయోజనాన్ని వర్తింపచేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి నగదు రూపంలో ఉద్యోగులకు ఇచ్చింది. 9వ పీఆర్సీలో 19 నెలలు ఉద్యోగులు తమ ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోయారు. 2013, జులై ఒకటి నుంచి పదో పీఆర్సీ అమలు కావాలి. కానీ 2014, జూన్ 2 నుంచి 43 శాతం ఫిట్‌మెంట్‌తో అమలైంది. అయితే 2015, ఏప్రిల్ ఒకటి నుంచి నగదు రూపంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చింది. పదో పీఆర్సీలో 12 నెలలపాటు ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాన్ని వదులుకోవాల్సి వస్తున్నది. ఇలా ప్రతి పీఆర్సీలోనూ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాన్ని నష్టపోతూనే ఉన్నారు. తెలంగాణలోనైనా సకాలంలో పీఆర్సీ అమలవుతుందని అందరూ ఆశించారు. 'తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2018, జూన్ 2న మధ్యంతర భృతి (ఐఆర్), ఆగస్టు 15 నాటికి పీఆర్సీ నివేదిక ఇవ్వడంతోపాటు అమలు కావాలి.'అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 2018, మే 16న ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీ నీటి మీద రాతే అయ్యిందన్న అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
తాత్సారం చేయడం సరికాదు : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
పీఆర్సీని సకాలంలో అమలు చేయకుండా తాత్సారం చేయడం సరైంది కాదు. ఉమ్మడి ఏపీలో పీఆర్సీ ఆలస్యమైతే ఉద్యమించి సాధించుకున్న సందర్భాలున్నాయి. ఉద్యోగులు అడగకుండానే పీఆర్సీ కమిటీని వేసి కాలయాపన చేయడం తగదు. పీఆర్సీ నివేదిక ఇచ్చినా త్రిసభ్య కమిటీ పేరుతో అధ్యయనం చేయడం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకపోవడం, ఇంకా బహిర్గతం చేయకపోవడం దుర్మార్గం. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను విశ్వాసంలోకి తీసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులుంటే వివరించాలి. అంతే తప్ప కాలయాపన చేయడం సరైంది కాదు.
టీఎన్జీవో, టీజీవో ప్రకటనలతో గందరగోళం : చిలగాని సంపత్‌కుమారస్వామి, టీఈఏ అధ్యక్షులు
టీఎన్జీవో, టీజీవో నేతల ప్రకటనలతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి పీఆర్సీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. పోరాడాల్సిన ఆ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తరఫున ప్రకటన చేయడం సరికాదు. ఈ వైఖరిని విడనాడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పింఛనర్ల కోసం పోరాడాలి. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 23న జరిగే నిరాహారదీక్షలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమానికి ఆ సంఘాలు సంఘీభావం ప్రకటిస్తేనే ఉద్యోగుల్లో నమ్మకం కలుగుతుంది.