Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోడేఘాట్‌లో కుమురంభీం మనవడితో కలిసి పోరుయాత్ర
- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న జాతాలు
నవతెలంగాణ- విలేకరులు
''కార్మికులు.. కర్షకులు.. సామాన్య ప్రజలే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టే చట్టాలు అవి.. వెంటనే వాటిని రద్దు చేయాలి.. కార్పొరేట్ శక్తులు.. అంబానీ, అదానీలకు లబ్ది చేకూర్చేలా కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్‌లుగా చేశారు.. వ్యవసాయంలోకి వారికి రెడ్ కార్పెట్ పరిచారు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుయుక్తులను పసిగట్టిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతుంటే.. ఆ పోరాట పటిమకు దేశ ప్రజానీకం మొత్తం కదులుతున్నా.. కేంద్రం మాత్రం ఉద్యమాన్ని అణచే కుట్ర చేస్తోంది తప్ప తప్పును సరిదిద్దుకునేందుకు ముందుకు రావడం లేదు.. కానీ, దేశానికి అన్నం పెట్టే ఆ రైతులు గట్టి బుద్ధి చెబుతారు'' అంటూ కార్మిక- కర్షక పోరు యాత్రల్లో నేతలు పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జాతాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్మిక-కర్షక పోరు యాత్రను శనివారం కుమురంభీం పోరుగడ్డ జోడేఘాట్‌లో కుమురంభీం మనవడు సోనేరావ్‌తో కలిసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు ప్రారంభించారు. ముందుగా భీం విగ్రహానికి పూలమాలలు వేసి, సమాధి వద్ద నివాళులర్పించారు. పోరుయాత్రకు అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, రవాణా రంగ కార్మికులు సంఘీభావం తెలిపారు. హట్టి గ్రామ సమీపంలోని కమాన్ వద్ద జీపు యాత్రకు డోలు చప్పుళ్ల నడుమ ఘనస్వాగతం పలికారు. హట్టి గ్రామం నుంచి యాత్ర కెరమెరికి చేరుకుంది. అనంతరం తొడసం భీంరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలతో పాటు కార్మిక వ్యతిరేక కోడ్‌లు, విద్యుత్ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలో పోరుయాత్ర నల్లగొండ, మాడ్గులపల్లి, కనగల్, గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, హాలియాలో సాగింది. నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సభలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోరుయాత్ర హుజూరాబాద్, చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలాలతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సాగింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు సుధాకర్ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటం రాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. బిల్డింగ్ వర్కర్స్, మేస్త్రి, మున్సిపల్ వర్కర్స్, హమాలీ, ఆటో యూనియన్లు, అంగన్వాడీలు, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ప్రారంభమైన జీపు జాతా దుబ్బాక మండల కేంద్రానికి చేరుకుంది. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలకిë మాట్లాడారు. కార్మిక కర్షక ఐక్యతతో ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటాన్ని గ్రామ గ్రామానికీ విస్తరించాలన్నారు. రైతు వ్యతిరేక కొత్త వ్యవసాయ చట్టాలను, కార్మిక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ అన్నారు. హైదరాబాద్ జిల్లా జీపు జాతా నాంపల్లి, అంబర్‌పేట నియోజకవర్గాల్లో కొనసాగింది. ఖమ్మం జిల్లా వైరా, కామేపల్లి, రఘునాధపాలెంలో మండలాల్లో కార్మిక, కర్షక పోరు యాత్ర జరిగింది. వైరాలో పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు అధ్యక్షతన సభలో సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్.. చట్టాలపై ప్రజలకు వివరించారు. మోడీ ప్రభుత్వం దేశ సంపదను, ప్రభుత్వ సంస్థలను పెట్టుబడిదారులకు అప్పగిస్తోందన్నారు. రఘునాధపాలెంలో జాతాకు ఆశా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
నూతన సాగు చట్టాలు వెనక్కు తీసుకోకపోతే రైతులే కేంద్రానికి బుద్ధి చెప్తారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో కార్మిక-కర్షక పోరు యాత్ర మాక్లూర్ మీదుగా నిజామాబాద్ నగరానికి చేరుకుంది. యాత్రకు పలుచోట్ల కార్మికులు పూలు జల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో జీపుజాతా కొనసాగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికుల, కర్షకుల, సామాన్య ప్రజల హక్కులపై దాడిచేస్తోందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రం, గోవిందరావుపేటలో జాతాకు పలు ప్రజాసంఘాల కార్యకర్తలు, కార్మికులు ఘన స్వాగతం పలికారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు మాట్లాడారు.