Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1.20 లక్షల మందికిపైగా ఎదురుచూపులు
- 57 ఏండ్ల హామీని విస్మరించిన సర్కారు
- 65 ఏండ్లు దాటినోళ్లకూ రాని వైనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు(80) పింఛన్ కోసం 2019 నవంబర్‌లో దరఖాస్తు పెట్టుకున్నది. కలెక్టర్ వద్ద అప్రూవల్ కూడా అయింది. కానీ, నేటి వరకు పింఛన్ రాలేదు. రాష్ట్రంలో ఇలా 65 ఏండ్లకు పైబడినవారు లక్షా 20 వేల మందికిపైగా అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వీరిలో ఒక్కరికంటే ఒక్కరికీ రాలేదు. 57 ఏండ్ల దాటిన వారి దరఖాస్తులను ఇంకా పూర్తిస్థాయిలో తీసుకోనేలేదు. ఇదేంటని ఉన్నతాధికారులను అడిగితే..'రాష్ట్ర సర్కారు ఆదేశాలు రాలేదు..మేమేం చేయలేం' అంటూ చెబుతున్న పరిస్థితి. 57 ఏండ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఏమోగానీ 65 ఏండ్లు దాటినోళ్లకూ రాని దుస్థితి.
రాష్ట్రంలో 2019 ముందస్తు ఎన్నికల తర్వాత కొత్త పింఛన్ల మంజూరు ఆగిపోయింది. ఆ ఎన్నికల సమయంలో 57 ఏండ్లు దాటిన వారికల్లా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ ఎన్నికల తర్వాత అప్పటి నుంచి నేటిదాకా చాలా మంది పేదల వయసు 65 ఏండ్లు దాటింది. చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, వితంతువుల కేటగిరీల్లోనూ చాలా మంది ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది అప్లికేషన్లు వచ్చాయి. అందులో లక్షా 20 వేల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. కానీ, కొత్తగా పింఛన్లు మాత్రం రావట్లేదు. 57 ఏండ్లు దాటిన వారికి కూడా ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో కొత్తగా ప్రతి గ్రామంలోనూ సగటున 20 నుంచి 30 మంది దాకా తమ ఆధార్‌కార్డు, చిరునామా, ఆదాయ ధ్రువీకరణపత్రం, వయస్సు నిర్ధారణ పత్రం, బ్యాంకు అకౌంట్ వివరాలు, వితంతువులైతే తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులు సదరం సర్టిఫికెట్లను ి పింఛన్ దరఖాస్తుఫారాలకు జతచేసి కార్యదర్శులకు ఇచ్చారు. కానీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎంట్రీలు మాత్రం చేయలేదు. దీంతో గ్రామాల్లో కొత్త దరఖాస్తులను కూడా తీసుకోవట్లేదు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీతకార్మికులు పింఛన్ల కోసం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడం, ఎప్పుడిస్తారో తెలియకపోవడంతో దరఖాస్తుదారులకు సమాధానాలు చెప్పలేక, మొహం చూపించుకోలేక తప్పించుకుతిరుగుతున్న పరిస్థితి గ్రామాల్లో నెలకొంది.
తీసేసిస వారిస్థానంలో కొత్తవారికీ ఇవ్వని వైనం
రాష్ట్రంలో 2019 డిసెంబర్ నాటికి ఆసరా, ఒంటరి మహిళలు, తదితర పింఛన్లు లబ్దిదారుల సంఖ్య 39,14,194 ఉండగా, 2020 డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 37,97,660కు చేరింది. పింఛన్ తీసుకుంటూ అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయిన లబ్ధిదారులు, వరుసగా మూడు నెలల పాటు పింఛన్ తీసుకోని వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఇలా ఒక్క ఏడాదిలోనే 1,16,534 పేర్లను ఆసరా జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. 2019 డిసెంబర్‌లో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారానే 52,082 మంది పేర్లను తీసేసింది. అలా తొలగించిన వారి స్థానంలో కొత్తగా లబ్దిదారులను ఎంపికచేయలేదు. దీంతో ప్రతి నెలా సుమారు రూ.30 కోట్ల ఆసరా నిధులు మిగిలిపోతున్నాయి. బడ్జెట్ మిగిలినా కూడా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదనే విమర్శలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన సుమారు లక్షా 20 వేల మందికి పెన్షన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. 57 ఏండ్లకే ఫించన్ మాట ఏమోగానీ 65 ఏండ్లు దాటినా పింఛన్ ఎప్పుడొస్తుందా? అని దరఖాస్తుదారులు కండ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే సాధ్యమైనంత మేరకు తీసేసుకుంటూ పోవడమే తప్ప కొత్తగా ఇచ్చుడదనేది స్పష్టమవుతున్నది.