Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపైనే బైటాయింపు
- సంపత్, సదానందం, చావ రవి, జంగయ్య సహా పలువురి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
- నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు
- పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
- నెలాఖరులోగా చర్చించాలి : స్టీరింగ్ కమిటీ సభ్యులు
- అరెస్టులు అక్రమం : నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదనీ, ప్రభుత్వం వారిపైనే ఆధారపడి ఉద్యమాలను అణచివేస్తున్నదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు విమర్శించారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరనీ, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈనెలాఖరులోగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పీఆర్సీ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఒకరోజు నిరాహారదీక్ష చేయాలని ఐక్యవేదిక నిర్ణయించింది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించి దీక్ష భగం చేశారు. ఐక్యవేదిక నాయకులు ఇందిరాపార్క్ వద్ద రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 'సీఎం డౌన్...డౌన్, పోలీసుల జులుం నశించాలి, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, వురు వాంట్ జస్టిస్' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు సంపత్‌కుమారస్వామి, జి సదానందంగౌడ్, చావ రవి, కె జంగయ్య, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్‌రెడ్డి, ఎం రాధాకృష్ణా, కె కృష్ణుడు, యు పోచయ్య, పి కృష్ణమూర్తి, ఎస్ మధుసూదన్‌రావు, బి కొండయ్య, కొమ్ము రమేష్, శాగ కైలాసం, ఎ రాజేంద్రబాబు, ఎస్ హరికృష్ణ, ఎన్ చెన్నరాములు, నగేష్ యాదవ్, ఎ గంగాధర్, డివి రావు, వెంకట్రావు జాదవ్, ఎం పర్మతరెడ్డి, కె మహిపాల్‌రెడ్డి, ఎస్ విఠల్, పి చంద్రశేఖర్, ఎ లక్ష్మణ్‌గౌడ్, ఎస్ మహేష్, మల్లీశ్వరి, జి నిర్మల, ఎల్ అరుణమ్మ, వి శ్రీనునాయక్, ఎన్ యాదగిరి, చింతా రమేష్, జి బాలస్వామి, ఈ గాలయ్య, పి మాణిక్‌రెడ్డి, గీతాంజలి, కుమారస్వామి, కె బిక్షపతి, వై విజయకుమార్, ఆర్ ఈశ్వరయ్య, టి నటరాజ్, మీర్ ముంతాజ్ అలీ, టి విజయసాగర్, జి రాములుతోపాటు మరో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు సంపత్‌కుమారస్వామి, జి సదానందంగౌడ్, చావ రవి, కె లక్ష్మయ్య, ఎ రాజేంద్రబాబు మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని కోరడం సిగ్గుచేటన్నారు. 2018, మే 16న సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ, ఇందుకోసం ఉత్తర్వులి వ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను బహిర్గత పర్చాలనీ, అందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు. ఈనెలాఖరులోగా సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌ను 2018, జులై ఒకటి నుంచి అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పారు. సీపీ ఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరిం చాలని డిమాండ్ చేశారు. 2004, సెప్టెంబర్ ఒకటి కంటే ముందు ఎంపిక ప్రక్రియ పూర్తయి ఆ తర్వాత నియామక మైన వారికి పాతపింఛన్ వర్తింపచేయాలని సూచించారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఈ రాష్ట్రానికి తేవాలని కోరారు. పోలీసుల తీరు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ఉందన్నారు. అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాటం చేయడం లేదన్నారు. ప్రభుత్వం అణచివేయాలని చూస్తే మరింత ఉవ్వెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
అరెస్టులు అక్రమం : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
పీఆర్సీ సాధన, సమస్యలు పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్ వద్ద నిరాహారదీక్షకు పూనుకున్న నాయకులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తీవ్రంగా ఖండించారు. సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తున్నదని విమర్శించారు. పీఆర్సీ, ఇతర సమస్యలపై ఐక్యవేదిక నాయకులను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.