Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ అరవింద్‌ను నిలదీసిన పసుపు రైతులు
- రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముఖాముఖి
- బోర్డు నా స్థాయి కాదు.. ధర తన పరిధిలో లేదు.. ఏం చేస్తరో చేస్కోండి : ఎంపీ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిది/కమ్మర్‌పల్లి
లోక్‌సభ ఎన్నికల్లో హామీనిచ్చినట్టుగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తావా లేక ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా అని పసుపు రైతులు ఎంపీ ధర్మపురి అరవింద్‌ను నిలదీశారు. పది రోజుల గడువు ఇస్తున్నామని, పదవికి రాజీనామా చేసి రైతుల ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే ఎంపీని గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరిం చారు. అయితే, పసుపు పంటకు మద్దతు ధర
అంశం తన పరిధిలో లేదు.. ప్రత్యేక బోర్డు ఏర్పాటు తన స్థాయి కాదు.. రైతులు ఏం చేస్తారో చేస్కోండి అంటూ ఎంపీ అరవింద్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఎంపీ వైఖరిని నిరసిస్తూ రైతులు 'ఎంపీ డౌన్‌డౌన్' 'ఎంపీ రాజీనామా' చేయాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పసుపు బోర్డు, మద్దతు ధరపై పసుపు రైతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలో ఎంపీ అరవింద్‌తో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాజాకీయ పార్టీలకు అతీతంగా గత లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు డిమాండ్‌తో పోటీ చేసిన అభ్యర్థులు, రైతు నాయకులు పాల్గొన్నారు. ఎంపీ అరవింద్‌ను, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డిని రైతులు ఆహ్వానించారు. సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగింది. ముందుగా ఎంపీ మాట్లాడుతూ.. పసుపు పంట అంశంపై వివిధ కేంద్ర మంత్రులతో సమావేశమయ్యానని, జిల్లాలో స్పైస్ రీజినల్ బోర్డు కార్యాలయం తానే ఏర్పాటు చేయించానని చెప్పారు. మధ్యవర్తుల వల్లే రైతుల పంటకు ధర రావడం లేదన్నారు. మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వంతో లేఖ రాయిస్తే రూ.10 వేల వరకు వచ్చేలా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఎంపీ వ్యాఖ్యలపై రైతులు ఒక్కసారిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు ఈ-నామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులను రైతులకు అనుసంధానం చేయిస్తామని చెప్పి.. మళ్లీ ఇప్పుడు ఆన్‌లైన్ ట్రేడింగ్ నుంచి పంటను తొలగిస్తాననడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. జిల్లాలో పసుపు పంటను పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తామని, కానీ ఇటీవల కాలంలో ఎరువుల ధరలు భారీగా పెరిగాయి.. కానీ పంటకు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఏం సంబంధముందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు హామీ నెరవేర్చలేదనే ఎన్నికల్లో ఓడించి, బోర్డు హామీనిచ్చిన మిమ్మల్ని గెలిపించామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టడమేంటని ప్రశ్నించారు. వాదనలు, వాగ్వాదం నేపథ్యంలో.. అసలు పసుపు రైతులకు తాను రాసిచ్చిన బాండ్ పేపర్‌లో బోర్డుకు నిర్ధిష్ట సమయం, పంటకు మద్దతు ధర కల్పిస్తానని చెప్పలేదని ఎంపీ అరవింద్ మాట మార్చారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజుల్లో బోర్డు తీసుకొస్తానని చెప్పిన పలు వీడియోలను ప్రదర్శించారు. ఒకవేళ టీఆర్‌ఎస్ నుంచి లేఖ కావాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి తమతో పోరాటంలో భాగస్వామ్యం కావాలని రైతులు డిమాండ్ చేశారు. 'మా ఉద్యమానికి నేతృత్వం వహించండి. మీరు అగ్రభాగాన నడవండి. ఫామ్‌హౌస్, ప్రగతిభవన్, సెక్రటేరియేట్ ఇలా ఎక్కడి రమ్మంటే అక్కడికి వస్తాం' అని అన్నారు. రైతుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని ఎంపీ.. 'సబ్సిడీలు ఏమైనా కావాలంటే ఇప్పిస్తా. మద్దతు ధర నా పరిధిలో లేదు. బోర్డు నా స్థాయి కాదు. అది విధానపరమైన నిర్ణయం. మీరు ఏం చేసుకుంటారో చేస్కోండి' అంటూ లేచి వెళ్లిపోయారు. దీంతో రైతులు ఎంపీని వెంబడిస్తూ అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'ఎంపీ డౌన్‌డౌన్' 'ఎంపీ రాజీనామా చేయాలి' అని నినదించారు. ఈ సమావేశంలో రైతు ఐక్యవేదిక నాయకులు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన పన్నాల తిరుపతిరెడ్డి, కోల వెంకటేష్, పడిగెల ప్రవీణ్, సుంకెట రవి, మల్లారెడ్డి, సుమన్, ముక్కెర విజరు, ఏలిటి మల్లారెడ్డి, గడ్డం రాజేశ్వర్, ముస్కు మహేందర్, కొమ్ముల సంతోష్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో పాటు సుమారు 250 మంది వరకు రైతులు తదితరులు పాల్గొన్నారు.