Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరునెలల్లో డిండి
- నీటిపారుదల శాఖలో మస్కూరీల విలీనం ొ స్థానిక అధికారులకు ఆర్థికాధికారాలు ొ2 లక్షల నుంచి 25 కోట్ల వరకు : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లా కు సాగునీరు అందించే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఈఏడాది చివరి నాటికి వందశాతం పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఉన్న తాధికారులను ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావపరిస్థితులు నెల కొన్న నల్లగొండజిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండిప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దనీ, ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు
కేటాయిస్తామని సీఎం తెలిపారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, ఆయా స్థాయిల్లోని అధికారులే మంజూరు చేసి, పనులు చేసే అధికారం ఇచ్చే చారిత్రిక నిర్ణయం తీసుకున్నట్టు సీఎం వెల్లడించారు. మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వారికి శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్టు ప్రకటించారు.
పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సురేందర్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, సీఈలు మోహన్ కుమార్, రమేశ్, రఘునాథరావు, ఎస్‌ఈలు ఆనంద్, విజయభాస్కర్ రెడ్డి, ఉమాపతి రావు, సూర్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై సమీక్షలో భాగంగా ఉద్దండాపూర్ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు.
అధికారాల బదలాయింపు:సీఎం
''తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేది. ఇప్పుడు కోటి పది లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. సాగునీటి వసతి పెరగడం వల్లే ఇది సాధ్యమైంది. కోటి 25 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది. బోర్ల ద్వారా సాగయ్యే భూమి దీనికి అదనం. సాగునీరు అందించడంతోపాటు మిషన్ భగీరథకు కావాల్సిన నీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యత కూడా నీటి పారుదల శాఖకే ఉంది. దీంతో నీటి పారుదల శాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగింది. డీఈఈ స్థాయి నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ స్థాయి వరకు ప్రతీ అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)కు ఒక్కొక్క పనికి 1 కోటి మించకుండా, సంవత్సరానికి రూ. 25 కోట్లు, చీఫ్ ఇంజినీర్(సీఈ)కు ఒక్కొక్క పనికి రూ.50 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ. 5 కోట్లు, పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్‌ఈ )కు ఒక్కొక్క పనికి రూ. 25 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ. 2 కోట్లు, కార్యనిర్వాహక ఇంజనీర్(ఈఈ)కు ఒక్కొక్క పనికి రూ.5 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ. 25 లక్షలు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్(డీఈఈ)కు ఒక్కొక్క పనికి రూ. 2 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలి'' అని జీఎం కేసీఆర్ కోరారు.