Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
- ఎంటీఏఆర్ కంపెనీలో సీఐటీయూ జెండావిష్కరణ
నవతెలంగాణ-బాలానగర్
కార్మికుల పక్షాన నిలుస్తూ వారి హక్కుల కోసం పోరాడేదే సీఐటీయూ అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా బాలానగర్ పారిశ్రామికవాడలోని ఎంటీఏఆర్ పరిశ్రమలో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సీనియర్ నాయకులు బీఎన్ సుదర్శన్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఎంటీఏఆర్ టెక్నాలజీ కంపెనీలో కార్మికులు వారి హక్కులను కోల్పోతున్నారనీ, కొన్ని సంఘాలు కార్మికులను మోసం చేస్తూ యాజమాన్యానికి తొత్తులుగా మారి హక్కులను హరిస్తున్నారని తెలిపారు. కార్మికులు తమ హక్కుల సాధనకోసం సీఐటీయూ కార్మిక సంఘంలో చేరుతున్నారన్నారు. ఎంటీఏఆర్ పరిశ్రమలో త్వరలో జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో భారీ మెజారిటీతో సీఐటీయూ ప్యానల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ హక్కులను కాలారాస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్ర అశోక్, జె.చంద్రశేఖర్, జిల్లా నాయకులు కీలుకాని లక్ష్మణ్, ఐలాపురం రాజశేఖర్ ఎంటీఏఆర్ పరిశ్రమ యూనియన్ నాయకులు ఎంవీ రమణ, శంకర్ రెడ్డి, రాజు, రాఘవ రెడ్డి పాల్గొన్నారు.