Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టుపై సవతిప్రేమ
- బిల్లులందక పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు
- పరిహారం అందక పనులు అడ్డుకున్న నిర్వాసితులు
- కాళేశ్వరానికి యంత్రాల తరలింపు
- ప్రాజెక్టుపై సీఎం మరోసారి హామీ
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
నాలుగు జిల్లాల ప్రజలకు తలమానికంగా మారనున్న పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సవతిప్రేమ చూపిస్తున్నారంది. పలుమార్లు ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిస్తూ విస్మరిస్తూ వచ్చారు. అందులో భాగంగానే మరోమారు ప్రాజెక్టును ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేస్తామని శనివారం మాటిచ్చారు. రెండేండ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకోవడంతో మూడేండ్లైనా పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. మరి ఈ సారైనా సీఎం మాట నిలబెట్టుకుంటారా లేక విస్మరిస్తారా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే బకాయిలు చెల్లించకపోవడం, నిర్వాసిత రైతులకు పరిహారమివ్వాలని పనులు అడ్డుకోవడంతో కాంట్రాక్టర్లు యంత్ర సామాగ్రిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు తరలించారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే గానీ పనులు ప్రారంభించే పరిస్థితి లేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు జిల్లాలకు తాగు, సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. రూ.50వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుకు అడుగడుగునా ఆటంకాలే ఎదురౌతున్నాయి. అందుకు పాలకుల వైఫల్యమే ప్రధాన కారణం. రెండేండ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు మూడేండ్ల కాలంలో రూ.15 వేల కోట్లకు మించి నిధులు విడుదల చేయలేదు. దాంతో 25శాతం పనులు కూడా పూర్తి కాలేదు. నిధులు ఇలాగే కేటాయిస్తే మరో ఐదేండ్లయినా ప్రాజెక్టు పూర్తి కాదు. ఏదుల, ఒట్టెం, కరివేన రిజర్వాయర్ల పరిధిలో సుమారు రూ.3వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక ఒట్టెంలోనే రూ.వెయ్యి కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని, ఇక పనులేలా చేయాలని కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చివరి భాగమైన ఉదండాపూర్ నుంచి ఎత్తు ప్రాంతాలకు నీరందించే మార్గానికి ఇప్పటికీ డిజైన్లు ఖరారు కాలేదు. ముందు ఈ పథకం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుని ఆ తర్వాత మిగతా ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తయితే 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా లక్షన్నర ఎకరాలకు మించి అందడం లేదు. జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద మరో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి రిజర్వాయరు నార్లాపూర్ దగ్గర నిర్మించారు. ఇక్కడ ఇంకా రివిట్‌మెంట్ పనులు చేయాల్సి ఉంది. అప్రోచ్ కెనాల్ టన్నెల్, కర్నూలు సొరంగం పనులు నామా మాత్రంగానే సాగుతున్నాయి. నాలుగు కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి ఇప్పటివరకు కిలోమీటరు మాత్రమే పనులు చేశారు. ఏదుల రిజర్వాయర్ పూర్తయినా కెనాల్ పనులు చేయాల్సి ఉంది.
ఒట్టెం పనులను కొంతకాలంగా రైతులు అడ్డుకుంటున్నారు. ఎకరాకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇచ్చే దాకా పనులు చేయవద్దంటూ రైతులు కోర్టుకెళ్లారు. రైతుల అంగీకారం మేరకు పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పించినా పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు అక్కడక్కడా పనులను అడ్డుకుంటున్నారు. కరివేన దగ్గర పనులు ఆగిపోయాయి. ఇటు నిధులు రాక, రైతులకు పరిహారం అందక అడ్డుకోవడంతో కాంట్రాక్టర్లు చేసేదిలేక ఇక్కడి నుంచి యంత్ర సామగ్రిని కాళేశ్వరానికి తరలించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు విడుదల చేసి ప్రాజెక్టు పూర్తి చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
భూమి కోల్పోయి ఇబ్బందులు
ఏదుల రిజర్వాయర్‌లో నాకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి పోయింది. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పరిహారం అందక పోగా సాగునీరు లేక ఉపాధి కోల్పోయాం. ఇప్పటికైనా పరిహారం చెల్లించడంతో పాటు సాగు నీరు అందిస్తే వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తాం.
- రాములు, ఏదుల వనపర్తి జిల్లా