Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ అభివృద్ధికై రూ.4లక్షలు, ఎకనామికల్ సపోర్టు స్కీమ్ కింద ఆర్థికాభివృద్ధి : మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ-నర్సంపేట
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం పాడిగేదెల పంపిణీ చేపట్టిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మినీ డైయిరీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం కేటాయించిన రూ.17.40 కోట్ల విలువజేసే ప్రాజెక్టులో 435 మంది యూనిట్లకుగాను తొలుత 100 మంది దళిత కుటుంబాలకు పాడిగేదెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నారనీ, దానిలో భాగంగానే గొప్ప సంకల్పంతో మినీ డైయిరీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింది రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో పాడిగేదెలను ఒక్కో యూనిట్‌పై రూ.4లక్షలను ఇస్తున్నామని, ఇందులో నాలుగు గేదెలు, ఒక షెడ్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్ నుంచి ముర్రజాతి పాడిగేదెలను తెప్పించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. యూనిట్‌లో రూ.2.40 లక్షల సబ్సిడీ, 1.60లక్షలు బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం ఇస్తున్నామని తెలిపారు. విజయ డైయిరీ అనుసంధానంతో పాల సేకరణ చేసి తద్వారా లబ్ధిదారునికి లీటర్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహం కూడా ఇస్తున్నామన్నారు. ఎకనామికల్ సపోర్టు స్కీమ్‌తో పాటు దళితుల భూములను అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.4లక్షలు కేటాయిస్తున్నట్టు చెప్పారు. రూ.3.50లక్షలను యూనిట్‌తో కూరగాయాల సాగుకు ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. దళితులు తప్పని సరిగా ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మహ బూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, పశుసంవర్థక శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.