Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై సదస్సు
- హాజరుకానున్న సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- కొత్తగూడెం/ ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు వివిధ సదస్సుల్లో పాల్గొననున్నారు. దానిపై ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోడుసాగు దారులకు పట్టాలివ్వాలనీ, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి జిల్లాలో ఉదయం ప్రజాగర్జన నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు నుంచి కలెక్టరేట్ వరకు మహాప్రదర్శన సాగుతుంది. అనంతరం ధర్నా చౌక్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఖమ్మం పట్టణంలోని వర్తక సంఘం భవనంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్సీ), కేంద్ర ప్రభుత్వ విధానాలపై సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభలకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సు విజయవంతం చేయాలని ఆయన కోరారు.