Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు ఏజెంట్లుగా మారిన మోడీ, కేసీఆర్
- కార్మిక, కర్షక పోరు యాత్రలో నాయకులు
నవతెలంగాణ-విలేకరులు
కార్పొరేట్ శక్తులకు ఏజెంట్లుగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కార్మిక, కర్షకులకు తీరని అన్యాయం జరుగుతోందనీ, అందుకు కారణమైన వ్యవసాయ చట్టాలు, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు కోడ్లను వెంటనే రద్దుచేయాలని కార్మిక, కర్షక పోరు యాత్రలో సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ చట్టాలు రద్దుకాకపోతే కార్మికులు, రైతులకు భవిష్యత్తు లేదనీ, కెేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడుదామని ఆదివారం జరిగిన పోరుయాత్రలో నాయకులు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్, ఎడపల్లి, బోధన్ మండలాల్లో జీపుజాత నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడం, కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, జిల్లా నాయకులు, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట, రేవల్లి, ఘణపూర్, వనపర్తి, పెద్దమందడి, కొత్తకోట మండల కేంద్రాల్లో జీపుజాతా పర్యటించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలైన అంబానీ, ఆదానీలకు మేలు చేసేందుకే ఈ చట్టాలను చేశారని ఆరోపించారు. చట్టాలను ఉపసంహరించుకోకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటంరాజు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని హనుమాన్‌పేట ఫ్లైఓవర్ నుంచి మున్సిపల్ కాంప్లెక్స్ వరకూ జీపుజాతాకు స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడారు. చట్టాలకు వ్యతిరేకంగా పోరాడకపోతే దేశ సంపద కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందనీ, దాని వల్ల అన్ని వర్గాల ప్రజలపై భారం పడుతుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్‌జిల్లా రామాయంపేటలో ప్రారంభమైన యాత్ర నార్సింగ్, చేగుంట, చిన్నశంకరంపేట, తూఫ్రాన్ మండలాల గుండా మనోహరాబాద్‌కు చేరింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జయలక్ష్మి మాట్లాడారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడంతో కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో పాటు రైతులు, సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తున్నాయన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నరసమ్మ, ఉపాధ్యక్షురాలు బాలమణి పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో నిర్వహించిన జీపు జాతాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ పాల్గొని చౌరస్తాలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్, ఎల్‌ఐసీ చివరకు ఆయిల్ సెక్టార్‌లనూ ప్రయివేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్, జిల్లా కోశాధికారి మల్లేష్, ఐఓసీఎల్, నాట్కో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెంచికల్‌పేట్, చింతలమానేపల్లి, కౌటాలలో జాతా కొనసాగింది. రాష్ట్ర కార్యదర్శి బి మధు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్ త్రివేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నైతం రాజు పాల్గొన్నారు.
హైదరాబాద్ జియాగూడ కబేలాలో ప్రారంభమైన జీపుజాతా గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్, గోల్కొండ లేబర్ అడ్డా, లంగర్ హౌస్ లేబర్ అడ్డా, గోపి హోటల్ వరకు సాగింది. రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. కార్మికులకు, రైతులకు అన్యాయం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఐక్య పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, వెంకటేష్, నగర నాయకులు నాగేశ్వర్, మీనా, భవన నిర్మాణ సంఘం నాయకులు పాల్గొన్నారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో జీపుజాతా పర్యటించింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వరంగం సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, పలిమెల మండల కేంద్రాల్లో జీపుజాతా కొనసాగింది. రాష్ట్ర కోశాధికారి రాములు మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ప్రజలంతా కలిసి ఐక్యపోరాటాల ద్వారానే సమస్యలు పరి ష్కారమౌతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ములుగు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శులు రత్నం రాజేందర్, బంధు సాయిలు తదితరులు పాల్గొన్నారు.