Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర నేపథ్యాన్ని, అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుగుణంగా హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉద్యానవన పంటల సాగును మరింత విస్తరించే దిశగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరమున్నదనీ, ఈ నేపథ్యంలో హార్టికల్చర్ యూనివర్శిటీని బలోపేతం చేయాలని సీఎం సూచించారు. తెలంగాణ హార్టికల్చర్ అభివద్ధి దిశగా, ఆధునిక పద్ధతుల్లో ఉద్యానవన పంటల సాగుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలనీ, ఇందుకోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉద్యాన వన విశ్వవిద్యాలయం మౌలిక సౌకర్యాల రూపకల్పన అభివృద్ధి కోసం ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో నిధులను కేటాయిస్తుందని స్పష్టం చేశారు. వంటిమామిడి, రామగిరి ఖిల్లా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే 2,601 రైతు వేదిక నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇదే స్ఫూర్తితో సామాన్య ప్రజల అవసరాలను దష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా వున్న మున్సిపాల్టీలు, ముఖ్య పట్టణాల కేంద్రాల్లో, గజ్వేల్ తరహా సమీకత కూరగాయల మార్కెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు వంటి వ్యవసాయ ప్రోత్సాహక చర్యలతో తెలంగాణ వ్యవసాయం గాడిలో పడిందనీ రైతన్నల జీవితాలు గుణాత్మక అభివృద్ధి దిశగా సాగుతున్నాయనీ, ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ హార్టికల్చర్ విధానాన్ని రూపొందించుకోవాలని సీఎం అన్నారు. ఉద్యానవన పంటల అభివద్ధి కోసం సమగ్ర ప్రణాళిక అంశంపై ప్రగతిభవన్‌లో సీఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, హార్టికల్చర్ యూనివర్శిటీ వీసీ నీరజ, తదితర హార్టికల్చర్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ''ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మూస పద్ధతిలో సాగింది. ప్రాజెక్టుల కింద కాల్వల నీళ్లతో సాగయిన వరి పంటకే ఆనాటి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. తద్వారా సాగునీటి కొరత తీవ్రంగా నెలకొన్న తెలంగాణలో వ్యవసాయం బాగా వెనుకబడిపోయింది. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అంచనా వేయడంలో గత పాలకులు వైఫల్యం చెందారు.
వ్యవసాయ రంగానికి ఓ విధానం రూపొందించకపోవడం వల్ల నీటి కరువు ప్రాంతమైన తెలంగాణలో పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్లాంటి తక్కువ నీటితో సేద్యమయ్యే ఉద్యాన వన పంటలసాగు చాలావరకు విస్మరించబడింది. కానీ స్వయంపాలనలో ఇప్పుడు వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి దిశగా ముందుకు సాగుతున్నది. మన నేలల స్వభావం, మన పంటల స్వభావం మనకు అర్థమవుతున్నది. సాగునీటి ప్రాజెక్టుల వలన నీరు పుష్కలంగా లభిస్తున్న నేపథ్యంలో తక్కువ నీటి వాడకంతో ఎక్కువ లాభాలు గడించేందుకు మన రైతాంగాన్ని ఉద్యాన వన పంటల సాగు దిశగా ప్రోత్సహించాల్సిన అవసరమున్నది. ప్రభుత్వ ఉద్దేశాలను అర్థం చేసుకుని ఉద్యానవన నర్సరీలను నెలకొల్పే రైతులకు, పంటలను సాగుచేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక రైతులకు రైతుబంధుతో పాటుగా ప్రత్యేక ప్రోత్సాహాకాలను అందించేందుకు వ్యవసాయ, ఉద్యానవనశాఖలు కార్యాచరణ రూపొందించాలి. పండ్లు, కూరగాయలు, పూల సాగులో ఉద్యానవన శాఖ ఇప్పుడెలా వుంది? భవిష్యత్తులో ఎలా ఉండాలో ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి '' అని సీఎం తెలిపారు. '' తెలంగాణలో మొత్తం 129 మున్సిపాల్టీలు, గ్రేటర్ హైదరాబాద్ సహా, మరో 12 కార్పొరేషన్లు, ఇండిస్టియల్ నగరాలు, పట్టణాలున్నాయి.
వీటన్నింటిలో నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు వంటి నిత్యావసరాలను అందించేందుకు ఆ పట్టణాల చుట్టూ ఉండే కొందరు రైతులను ఎంపిక చేసి, కూరగాయలు తదితర ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరముంది. తద్వారా తెలంగాణలోని పట్టణ ప్రజలు ఇతర రాష్ట్రాలు నుంచి కూరగాయలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండదు'' అని సీఎం అన్నారు. అతి తక్కువ నీటి వినియోగం, అతి తక్కువ కాల పరిమితితో కూడిన ఉద్యానవన పంటల సాగుతో రైతులకు ఎక్కువ ఆదాయం మిగులుతుందని సమీక్షా సమావేశంలో పాల్గొన్న అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మనం కూరగాయలను దిగుమతి చేసుకునే స్థాయినుంచి ఎగుమతి చేసే దిశగా ఉద్యానవనశాఖ చర్యలు చేపట్టాలనీ, తద్వారా అంతర్గతంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకునే వీలుందని తెలిపారు. తెలంగాణ నేల అద్భుతమైన సాగు స్వభావాన్ని కలిగి ఉన్నదనీ, ఇక్కడ కురిసే వర్షాలు, గాలి, వాతావరణం హార్టికల్చర్ పంటలకు అత్యంత అనుకూలమైనదనీ, ఉద్యానవన పంటలను తెలంగాణలో అద్భుతంగా పండించవచ్చని సీఎం అన్నారు.