Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళా వికలాంగుల స్థితిగతులు, విద్య, ఉపాధిపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య తెలిపారు. చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ, మార్చి 18,19 తేదీల్లో ఎన్‌పీఆర్‌డీ జాతీయ కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశాలకు 25 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వికలాంగుల వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు రూపకల్పన చేస్తామన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1992 తర్వాత వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. విద్యా, ఉద్యోగాల్లో వికలాంగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో నాలుగు శాతం ఉద్యోగాలు వికలాంగులు కేటాయించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేలో కేవలం 0.03 శాతం మాత్రమే వికలాంగులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటు రంగంలో వికలాంగులకు నాలుగు శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి నాగలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు రంగారెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.