Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్రాష్ట్ర రహదారిపై రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-బోధన్
ప్రభుత్వం సొసైటీల్లో శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా హూన్స సొసైటీ చైర్మెన్ రవి మాట్లాడుతూ.. శనగ పంట చేతికొచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల దళారులు రూ.4000 నుంచి 4300 వరకు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రూ.5100 మద్దతు ధర ప్రకటించి, శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఎంత వరకు సమంజసమని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీల ద్వారా కాకుండా ప్రతి సొసైటీ కేంద్రాల్లో శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు బైటాయించడంతో ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే యత్నం చేశారు. ఆర్డీవో వచ్చే వరకు నిరసన విరమించే ప్రసక్తే లేదని రైతులు తేల్చిచెప్పారు.