Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ
నవతెలంగాణ-హైదరబాద్‌బ్యూరో
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గెలుపు సమాజ అవసరమని తెలంగాణ మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. శనివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ రాష్ట్ర నాయకులు పాలడుగు భాస్కర్, కమర్ అలీ, చాగంటి వెంకటయ్య (సీఐటీయూ), జె వెంకటేశ్, వివి మంగపతి, అంజయ్య (జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్), కె ఏసురత్నం, మందా వెంకటేశ్వర్లు, రవిచంద్ర, జయచంద్ర (ఏఐటీయూసీ), పి అరుణ్‌కుమార్, ప్రవీణ్ (ఐఎఫ్‌టీయూ), రెబ్బా రామారావు (హెచ్‌ఎంఎస్), అనూరాధ, యాదయ్య (ఐఎఫ్‌టీయూ), బాబూరావు (ఏఐయూటీయూసీ) తదితరులు మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలుపు కార్మికలోకానికి ఆవశ్యకమనీ, దాని కోసం అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల ఆందోళనల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలిపారని గుర్తుచేశారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నాలుగురోజుల మెటర్నిటీ సెలవుల ఉత్తర్వుల సాధనలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పాత్ర ఉన్నదని చెప్పారు. నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ, ఎలాంటి ప్రలోభాలకూ గురికాకుండా, నిస్వార్థంగా ఆయన ప్రజలకు సేవ చేస్తున్న ఆయన గెలుపు సమాజ అవసరమని అభిప్రాయపడ్డారు. పట్టభద్రులు ఆయనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్ నాగేశ్వర్: ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ మద్దతు
ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్ కె నాగేశ్వర్‌ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్స్ జేఏసీ పిలుపునిచ్చింది. శనివారం నాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్) ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య, పి శ్రీకాంత్ (సీఐటీయూ), క్యాబ్ జేఏసీ చైర్మెన్ షేక్ సలాఉద్దీన్, బి వెంకటేష్ (ఏఐటీయూసీ), కిరణ్ (ఐఎఫ్‌టీయూ), సతీష్ (టీఆర్‌సీపీటీయూ) మాట్లాడారు. గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు రోడ్డురవాణారంగ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని శాసనమండలిలో కార్మికవర్గం తరఫున మాట్లాడారని గుర్తుచేశారు. శ్రామికవర్గం తరఫున చట్టసభలు, ప్రభుత్వ వేదికలపై వాదన వినిపించడంలో ఆయన పాత్ర ఉన్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం-2019ను ఆయన వ్యతిరేకించారని చెప్పారు. కార్మికవర్గానికి అండగా నిలుస్తున్న నాగేశ్వర్ గెలుపు ప్రజాస్వామ్య, లౌకికవాదులకు అవసరమని స్పష్టం చేశారు.
సింగరేణి ఉద్యోగుల సంఘం మద్దతు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను గెలిపించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎస్‌సీఈయూ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్టు అధ్యక్షులు దొండేటి కొమరయ్య తెలిపారు.