Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇఫ్లూ కేసులో హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలను నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. అధ్యాపక ఇతర పోస్టుల భర్తీ తాము వెలువరించే ఉత్తర్వులు లోబడి ఉంటా యని షరతు విధించింది. పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేస్తూ జాతీయ బీసీ కమిషన్ ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చిందని ఇఫ్లూ హైకోర్టులో వేసిన రిట్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కమిషన్ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలన్న ఇఫ్లూ వినతిని పాక్షికంగా అమోదించిన హైకోర్టు భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించవచ్చుననీ, అయితే తామిచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా పోస్టుల భర్తీ ఉండాలని చెప్పింది. విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.
హైకోర్టు వినూత్న ప్రతిపాదన
సింగిల్ జడ్జి రూ. 2 వేలు జరిమానా వేసిన శిక్షను రద్దు చేయాలంటే ప్రజలకు మేలు జరిగే ఒక మంచి పని చేయాలని నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్‌కు హైకోర్టు వినూత్న ప్రతిపాదన చేసింది. బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం చేసిన ప్రతిపాదనకు ఆయన సమ్మతి తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసి ఆ వివరాలను నివేదిస్తామని కలెక్టర్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పరమేశ్వర్ బిన్నీ రైస్ మిల్లును బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించి ధాన్యం సరఫరా చేయాలన్న సింగిల్ జడ్జి ఆదేశాల్ని అప్పుడు జాయింట్ కలెక్టర్‌గా ఉన్న పాటిల్ అమలు చేయలేదని కోర్టు ధిక్కార రిట్ దాఖలైంది. రూ.2 వేలు జరిమానా విధిస్తూ నాలుగేండ్ల క్రితం సింగిల్ జడ్జి చెప్పిన తీర్పును రద్దు చేయాలని అప్పీల్ వ్యాజ్యాన్ని వేశారు. అధికారుల తనిఖీలో మిల్లులో అక్రమాలు జరిగాయని తేలిన తర్వాతే ఆ మిల్లును సీజ్ చేయడం జరిగిందని న్యాయవాది వివరించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని అమలు చేశామనీ, కొంత జాప్యం అవ్వడం వల్ల రబీలో వరి సరఫరా చేయలేకపోయామనీ, ఖరీఫ్‌లో జరిగిందని చెప్పారు. కోర్టు చేసిన సేవా ప్రతిపాదన ఆమోదయోగ్యమేనని చెప్పారు. అయితే, వచ్చే విచారణ నాటికి ఆ ప్రజాసేవ ఏదో చేసి చూపాలని హైకోర్టు ఆదేశించింది. కాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి గడువు ఇచ్చింది. చెన్నమనేని పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేసిన రిట్‌ను బుధవారం న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారించారు.