Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్
- నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు సవాల్ విసిరారు. సంజరు లేఖపై స్పందించిన ఆయన దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ మూలకు పెట్టింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు విస్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. సొంత పార్టీ మంత్రి చేసిన ప్రకటన గురించి సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న బెంగళూరులోనూ ఐటీఐఆర్ ఒక అడుగు ముందుకు పోలేదని చెప్పారు. మరి అక్కడ ఐటిఐఆర్ ప్రాజెక్టు ముందుకు సాగనందుకు కూడా తమ ప్రభుత్వమే కారణమా ? అని ప్రశ్నించారు. 2014 నుంచి రాసిన లేఖలు, సమర్పించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులన్ని(డీపీఆర్) బండి సంజయ్ కి ఇస్తామనీ, ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ విషయంలో వెనక్కి పోయిన బీజేపీ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఐటీఐఆర్ ప్రాజెక్టుపై, కేంద్రం నుంచి ఒక ప్రకటన చేయించాలన్నారు. దమ్ముంటే ఐటీఐఆర్ లేదా ఐటీఐఆర్‌కి సమానమైన మరో ప్రాజెక్టుని హైదరాబాద్ నగరానికి తీసుకురాగలరా ? అని అన్నారు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే అసత్యాలతో బండి సంజయ్ లేఖ రాశారన్నారు. బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర అని అభిప్రాయపడ్డారు. సిగ్గులేకుండా అసత్యాలు, అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ, ఆ పార్టీ నాయకుల నైజం మరోసారి బయటపడిందని విమర్శించారు.