Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరి నోట అదే మాట
- సమాధానం చెప్పలేని దుస్థితిలో బీజేపీ
- విశాల ఐక్యఉద్యమం దిశగా ప్రజాసంఘాలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే యోచనే లేదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి తాజాగా కుండబద్దలు కొట్టడంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ అంశం ఎన్నికల ఎజెండాగా మారింది. ఇప్పటివరకు నోరుమెదపని అధికార టీఆర్‌ఎస్ పార్టీ, మంత్రి కేటీఆర్ సైతం పార్లమెంట్‌లో నిలదీస్తామని ప్రకటించారు. కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ హక్కు అంటూ బీజేపీపై ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ 'ఇంటెగ్రల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)'ని వరంగల్ జిల్లా కాజీపేటలో ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కమిటీ కూడా వేసింది.. కాని పురోగతి లేదు. అయితే, 2019లో అప్పటి టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి కోచ్ ఫ్యాక్టరీపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి పీయూష్ గోయెల్ సమాధానమిస్తూ... కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం లేదని స్పష్టతనిచ్చారు. అయినా... రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కొంతకాలంగా పోరాటం జరుగుతూనే ఉంది. ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే రూ.380 కోట్ల విలువైన 150 ఎకరాల భూమిని సైతం అయోధ్యపురంలో ఇటీవల సేకరించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా రైల్వే అధికారులకు అప్పగించారు. అయితే కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా 'పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు'ను కేంద్రం మంజూరుచేసింది. గూడ్స్ వ్యాగన్ల మెయింటెనెన్స్‌కు సంబంధించిన ఈ వర్క్‌షాపు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నాయకులు మాత్రం కోచ్ ఫ్యాక్టరీపై ఏమీ స్పందించడం లేదు. మంత్రి కేటీఆర్ నోట ఎన్నడూ వినపడని కోచ్ ఫ్యాక్టరీ మాట ఇప్పుడు ఉన్నట్టుండి మాట్లాడటంపై పలు విమర్శలు వస్తున్నాయి.
ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరిగానే కోచ్ ఫ్యాక్టరీకి మంగళం పాడే ప్రయత్నం జరుగుతోందనీ, పార్లమెంట్‌లో నిలదీస్తామని కేటీఆర్ చెప్పడంతో ఎన్నికల్లో నిరుద్యోగుల ఆదరణ కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బీజేపీ ఉక్కిరిబిక్కిరి
రాజకీయ పార్టీలతోపాటు రైల్వే జేఏసీ, ప్రజాసంఘాలు కోచ్ ఫ్యాక్టరీ విషయాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చడంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బీజేపీ ఎంపీలెవరూ ఏనాడూ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించలేదు. ప్రభుత్వాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. పైగా వరంగల్ వచ్చిన ప్రతి నాయకుడు కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని విమర్శలు చేశారు. భూమిని కేటాయిస్తూ మంత్రి పత్రాలు అందజేసిన తర్వాత మాట్లాడటం లేదు. వామపక్షాలు, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, స్వతంత్ర అభ్యర్థులు కోచ్ ఫ్యాక్టరీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా బీజేపీ పట్టించుకోవడం లేదు. కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే తమకే నష్టం జరుగుతుందన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.
విశాల ఉద్యమానికి ప్రజాసంఘాలు సన్నద్ధం
కోచ్ ఫ్యాక్టరీ కోసం అనేక పోరాటాలు జరిగాయి. ప్రధానంగా వామపక్షాలు బలమైన పోరాటాలు చేశాయి. రైల్వే జేఏసీ, డివిజన్ సాధన సమితి ఏర్పడ్డాయి. వారంతా మీడియా సమావేశం నిర్వహించి అధికార పార్టీలు మినహా ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని విశాల ఉద్యమం చేస్తామని ప్రకటించాయి. దాంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టింది. ఓటర్లను తమవైపు తిప్పుకోవాలన్న టీఆర్‌ఎస్ వ్యూహం ఫలించేటట్టు లేదు. పట్టభద్రుల్లో అత్యధికులు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. వారంతా అధికార పార్టీలకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు లేకపోలేదు.