Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్షరాస్యత పెంపు కోసం చర్యలు
- ఖమ్మం, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాలు ఎంపిక
- జిల్లా, మండలాల వారీగా కమిటీల నియామకం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం పడ్నా లిఖ్నా అభియాన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అక్షరాస్యత పెంపుకోసం చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లా, మండల, పట్టణాల వారీగా కమిటీలను నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 15 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో అక్షరాస్యతను పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలతోపాటు ఇతర బలహీనవర్గాల్లో అక్షరాస్యత పెరగాల్సిన అవసరముందని వివరించారు. ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను ఖర్చు చేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు మూడు జిల్లాలను ఎంపిక చేసిందని తెలిపారు. ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని వివరించారు. పడ్నా లిఖ్నా అభియాన్ పథకాన్ని పర్యవేక్షణ చేయడం కోసం జిల్లాస్థాయి, మండల, పట్టణస్థాయి కమిటీలను నియమించామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ లిటరసీ మిషన్ అథారిటీ (డీఎల్‌ఎంఏ)ను నియమించామని తెలిపారు. ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా జిల్లా పరిషత్ చైర్మెన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు సభ్యులుగా, కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారని వివరించారు. జిల్లా మెజిస్ట్రేట్ చైర్‌పర్సన్‌గా జిల్లా పరిషత్ సీఈవో వైస్ చైర్మెన్‌గా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సభ్యకార్యదర్శిగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుందని తెలిపారు. ఎండీవో చైర్‌పర్సన్‌గా ఎంఈవో సభ్యకార్యదర్శిగా, వివిధ శాఖల మండలస్థాయి అధికారులు, ఎంపిక చేసిన హెడ్మాస్టర్లు, సీఆర్‌వోలు, ఎంపిక చేసిన కాలేజీ, పాఠశాలల ఉపాధ్యాయులు, పౌరసమాజం నుంచి కొందరు ప్రతినిధులు సభ్యులుగా మండల్ లిటరసీ మిషన్ కమిటీ (ఎంఎల్‌ఎంసీ) ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఈవో చైర్‌పర్సన్‌గా, ఆ ప్రాంతం విద్యాశాఖాధికారి సభ్యకార్యదర్శిగా, మహిళా ప్రజాప్రతినిధులు, కాలేజీ, పాఠశాల ఉపాధ్యాయులు, పౌరసమాజం నుంచి కొందరు ప్రతినిధులు సభ్యులుగా టౌన్ లిటరసీ మిషన్ కమిటీ (టీఎల్‌ఎంసీ) నియమిస్తామని వివరించారు.