Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- శంకర్‌పల్లి
పాస్ పుస్తకాల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికివేశంలో ఇద్దరు తమ్ముళ్లు అన్నను గొడ్డలితో హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో శుక్రవారం జరిగింది. సీఐ గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. టంగటూరు గ్రామానికి చెందిన చంద్రయ్యకు ఐదుగురు కుమారులు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరు జైలులో ఉన్నారు. ఉన్న ముగ్గురు అన్నదమ్ములు యాదయ్య(46), శ్రీనివాస్, పాండు. ఐదు మందికి కలిపి రెండు ఎకరాల భూమి ఉంది. భూమికి సంబంధించి ఎవరి పాస్ పుస్తకాలు వారి దగ్గర ఉన్నాయి. అయితే, కొంతకాలంగా ఈ భూమి విషయంలో ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, పాస్‌పుస్తకాలు కావాలని యాదయ్య తమ్ముళ్లు శ్రీనివాస్, పాండుని అడిగాడు. మేము ఎందుకివ్వాలని తమ్ముళ్లిద్దరూ అన్నతో ఘర్షణకు దిగారు. గొడవ తారస్థాయికి చేరడంతో తమ్ముళ్లిద్దరూ కలిసి అన్న యాదయ్యను గొడ్డలితో నరికి చంపారు. అనంతరం పాస్‌పుస్తకాలు తీసుకుని పరారయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గోపీనాథ్ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.