Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదలైన టికెట్ లొల్లి
- అరడజను మంది పోటీ
- కేసీఆర్ సర్వేలో బీసీలకే ఇవ్వాలని వచ్చిందని ప్రచారం ?
- స్థానికులకే ఇవ్వాలంటున్న క్యాడర్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టికెట్ కేటాయింపు విషయం టీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అరడజను మంది పోటీ పడుతున్నారు. ఎవరికి వారే తమ అనుయాయులతో అధిష్టానం దృష్టిలో పడేలా చేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత సామాజిక తరగతుల వారీగా నియోజకవర్గంలో సర్వే చేయించారని, బీసీ సామాజిక తరగతికి కేటాయిస్తేనే ఫలితం ఉంటుందని సర్వే తేల్చినట్టు ప్రచారంలో ఉంది. అయితే, బీసీల కంటే స్థానికులకే టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ క్యాడర్ అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది.
ఆశావాహులు ఎక్కువే..
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం తరువాత ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఉప ఎన్నిక టికెట్ కోసం టీఆర్‌ఎస్‌లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇందులో ప్రధానంగా శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మెన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కుమార్, గురువయ్య యాదవ్, దూదిమెట్ల బాలరాజ్ టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారుగా టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్‌ఎస్.. ఇక్కడ టికెట్ కేటాయింపు విషయంలో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక కోసం ఈ మధ్యే నియోజకవర్గంలో సర్వే చేయించారు. అందులో బీసీ నేతను బరిలో దించితేనే విజయం సాధించడం సులభమని తేలిందని ఆ పార్టీ నేతలు పలువురు చెబుతున్నారు.
తెరమీదికి స్థానికత అంశం
నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కుమార్ బీసీ సామాజిక తరగతే అయినప్పటికీ స్థానికుడు కాదనే వాదన పార్టీ నాయకత్వంలో ఉంది. దీంతో నిడమనూర్ మండలం వెనిగండ్లకు చెందిన గురువయ్య యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన నేటి నాగార్జునసాగర్ నాటి చలకుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమూర్తి యాదవ్‌కు అల్లుడు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌కు తోడల్లుడు. ఆ సామాజిక తరగతి ఓట్లతో పాటు ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వ్యక్తి అనే పేరుంది. బీసీ వ్యక్తికే టికెట్ ఇవ్వాలనుకుంటే మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా గురువయ్యను సూచించినా ఆశ్చర్యపోవాల్సింది లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న క్యాడర్ కూడా స్థానికుడికే టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారని తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం స్థానికుడు, యాదవ సామాజిక తరగతి, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
తనకంటే తనకేనంటూ ప్రచారం
హాలియాలో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభకు సీఎం హెలికాప్టర్‌లో వచ్చారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కూడా వచ్చారు. ఆ సందర్భంలోనే తనకు టికెట్ వస్తుందని కేసీఆర్ పరోక్షంగా చెప్పినట్టుగా క్షేత్రస్థాయి ప్రజా ప్రతినిధులు, నాయకులకు నేరుగా ఎమ్మెల్సీ ఫోన్ ద్వారా చెప్పారని స్థానిక నేతలు అంటున్నారు. కలిసి పనిచేద్దామని, సహకరించాలని కోరుతూ వారి కుటుంబ యోగక్షేమాలు కూడా తేరా అడిగి తెలుసుకుంటూ మచ్చిక చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తుంది. ఇక మంత్రి జగదీశ్‌రెడ్డికి అనుచరుడిగా ఉన్న ఎంసీ కోటిరెడ్డి గతంలో కూడా టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. ఈసారి వదులుకునే ప్రసక్తే లేదని పట్టుపడుతున్నట్టు సమాచారం. మంత్రి కూడా భరోసా ఇచ్చారని తెలుస్తుంది. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఏదైనా జాతీయ పార్టీలోకి వెళ్లి పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో పోటీలో నిలిచేందుకు అభ్యర్థుల సంఖ్య పెరిగిపోవడం, స్థానికత, బీసీ సామాజిక తరగతికి ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుండటంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి కాస్త వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా నేతలంతా ఎవరి ప్రయత్నాలూ వారు చేసుకుంటున్నారు. ఏదేమైనా టీఆర్‌ఎస్‌లో టికెట్ పంచాయితీ పెద్ద దుమారమే లేపుతుందన్న ప్రచారమూ సాగుతోంది. మరి టికెట్ ఎవరికి వస్తుంది..జంప్ జిలానీలు ఎవరు అవుతారు..అనేది వేచి చూడాల్సింది.