Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-జనగామ
ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతూ ప్రజల పక్షాన పోరాడే జయసారధిరెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. జనగామ జిల్లా కేంద్రం విదయ హాస్పిటల్‌లోని కాన్పరెన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను యథేచ్ఛగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుందన్నారు. దేశ సంపదను కొద్ది మంది చేతుల్లో పెడుతూ ప్రజాఅవసరాలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
వ్యవసాయ చట్టాలు అమలైతే కార్పొరేట్ సంస్థలు ఇష్టారీతిన రైతులను, ప్రజలను దోచుకుంటాయని ఆరోపించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కూడా అమ్మకానికి పెట్టడంలో ప్రభుత్వ కుటిల నీతి అర్థం అవుతుందని తెలిపారు. నిధులు, నీళ్లు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని సూచించారు. ఆరేండ్లు పనిచేసిన టీఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తే జయసారధిరెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రావు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, యూటీఎఫ్ కార్యదర్శులు వెంకటేష్, నామోజు శ్రీనివాస్, గుడుగుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.