Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాకిచ్చిన యాజమాన్యం
- కోర్టుధిక్కరణ పేరుతో ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
విద్యుత్ ఉద్యోగులకు యాజమాన్యం షాకిచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం స్థానికత పేరుతో వారికి ఇచ్చిన ప్రమోషన్లంటినీ రద్దు చేయనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున,
అవి పూర్తయ్యాక పూర్తిస్థాయిలో ప్రమోషన్లంటినీ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. తొలి విడతలో టీఎస్ జెన్‌కోలో చీఫ్ ఇంజినీర్లు (సిఈ)గా ప్రమోషన్లు పొందిన తొమ్మిది మందిని, తిరిగి సూపరింటెండింగ్ ఇంజినీర్లు (ఎస్‌ఈ)గా రివర్షన్ చేస్తూ, పాత తేదీతో ఉత్తర్వులు జారీ చేశారు. 2015 అక్టోబర్ 17, 2017 జూన్ 12 తేదీల్లో ఉద్యోగులకు ఇచ్చిన పదోన్నతులన్నింటినీ విద్యుత్ సంస్థలు రద్దు చేయనున్నాయి. దానిలో భాగంగానే శుక్రవారంనాడు పాత తేదీలతో టీఎస్ జెన్‌కోలో ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పదోన్నతులు పొందిన ఇతరులకు రివర్షన్ ఇస్తారని విద్యుత్ సంస్థల్లో ప్రచారం జరుగుతున్నది. దాదాపు 1,150 మంది ఇంజినీర్లు, అధికారులకు రివర్షన్లు ఇస్తూ జస్టిస్ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ తుది నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. దాన్ని అమలు చేయాలని 'సుప్రీం' అదేశించడంతో విధిలేని పరిస్థితుల్లో రివర్షన్లు ఇవ్వాల్సి వచ్చిందని జెన్‌కో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఉద్యోగుల సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకొని స్థానిక ఉద్యోగులతో కలిపి, కొత్త సీనియారిటీ జాబితాలు తయారు చేసి మళ్లీ పదోన్నతులు ఇస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే దీన్ని తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.