Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజాగా 1914 మందికి కోవిడ్.. ఐదుగురు మరణం
- తెలంగాణలో రెండ్రోజుల్లో రెట్టింపు..
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా శరవేగంగా విస్తరిస్తున్నది. ఇంతకు ముందు కేసులు రెట్టింపయ్యేందుకు వారాలు, నెలల సయమం పట్టేది. ప్రస్తుతం కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే దాదాపు రెట్టింపు సంఖ్యలో నమోదయ్యాయి. సోమవారం 1097 మందిలో వైరస్ బయటపడగా, మంగళవారం 1498 మందిలో, బుధవారం ఏకంగా 1914 మందిలో వెలుగుచూసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,617 యాక్టివ్ కేసులున్నాయి. మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1734కు చేరింది. మరో వైపు కొత్త కేసులతో పోలిస్తే కోలుకుంటున్న వారి సంఖ్య మరీ తక్కువగా ఉం టుంది. తాజాగా 285 మంది మాత్రమే కోలుకు న్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడిం చింది. పాజిటివ్ రేటు కూడా అత్యధికంగా ఉంటు న్నది. తాజాగా 74,274 మందికి టెస్టులు చేయగా వారిలో 2.57 శాతం మందిలో వైరస్ ఉన్నట్టు తేలింది. తాజాగా పరీక్షలు చేయించుకున్న వారిలో 49.1 శాతం మంది ప్రైమరీ కాంటాక్టు కాగా, 11.9 శాతం మంది సెకెండరీ కాంటాక్ట్ వ్యక్తులున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండా లనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఏ మాత్రం అనుమానమున్నా, పాజిటివ్ వ్యక్తులకు సన్నిహితంగా మెలిగినా సరే వెంటనే పరీక్షలు చేయించుకోవాలనీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 మందిలో వైరస్ బయటపడింది. ఆ తర్వాత మేడ్చల్ - మల్కాజిగిరిలో 205, నిజామాబాద్ జిల్లాలో 179, రంగారెడ్డిలో 169, నిర్మల్ జిల్లాలో 104 మంది వైరస్ బారిన పడ్డారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురికి సోకింది.
లాక్ డౌన్, కర్ఫ్యూ ఉండదు : ఈటల రాజేందర్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ లౌక్ డౌన్ గానీ, కర్ఫ్యూ గాని విధించే అవకాశం లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం మంత్రి ఉన్నతాధికారులతో తాజా పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం మీడియా ,పారిశ్రామికవేత్తలతో జరిగిన వేర్వేరు భేటీల్లో మంత్రి మాట్లాడారు. ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ర్యాపిడ్ టెస్టులు వచ్చిన తర్వాతే ట్రేసింగ్ వేగవంతమైందనీ, మరణాల శాతం తగ్గిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రతి రోజూ 56 వేల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామనీ, భవిష్యత్తులో 1.5 లక్షల మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే పరీక్షలను ప్రతి రోజూ లక్ష మందికి చేస్తామన్నారు.