Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రెండు దోసిళ్ళ కాలం' ఆవిష్కరణ సభలో వక్తలు
నవ తెలంగాణ - సిటీబ్యూరో
మట్టిపొరల్లోని చరిత్రను ఆవిష్కరించిన కవిత్వం శ్రీరామోజు హరగోపాల్ కవిత్వమని పలువురు వక్తలు అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హరగోపాల్ రాసిన 'రెండుదోసిళ్ళ కాలం' కవితా సంకలన ఆవిష్కరణ సభ జరిగింది. రచన సాహితీ కళావేదిక, ఆలేరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు సమన్వయకర్తగా కవి శివారెడ్డి వ్యవహరించారు. కవి, విరసం నేత వరవరరావు కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. ప్రధాన వక్తగా నందిని సిద్ధారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ.. భావాలకు భయపడే కాలం సాగుతోందన్నారు. చరిత్ర పరిశోధకునిగా ఉన్న హరగోపాల్ మట్టిపొరల్లోని చరిత్రను పునర్‌నిర్మాణం చేసే విధంగా కవిత్వం రాశారని అభినందించారు. ప్రాపంచిక దృక్పథంతో రెండు దోసిళ్ళకాలం కవిత్వాన్ని ఎంతో అద్భుతంగా ప్రజలతో మమేకమై రాశారన్నారు. నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. బతుకును అన్ని కోణాల్లో ఆవిష్కరించిన కవిత్వమని హరగోపాల్‌ను అభినందించారు. బాల్యం, జ్ఞాపకం లేకుండా కవిత్వం లేదన్నారు. చరిత్రను, వర్థమానాన్ని జోడించినదే రెండుదోసిళ్ళ కాలమన్నారు. ప్రధాన అతిథిగా డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ హాజరై మాట్లాడారు. బాల్య మిత్రుడైనందున తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. బాల్యం నుంచి హరగోపాల్ ఎదుర్కొన్న సంఘటనలు గుర్తుచేశారు. గౌరవ అతిథి కవి డాక్టర్ తిరునగరి మాట్లాడుతూ కవిత్వ ప్రాధాన్యతను వివరించారు. కవి, విమర్శకులు ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ పదునున్న మట్టి మనుషుల్లా రెండుదోసిళ్ళకాలం కవిత్వం తట్టి లేపుతోందన్నారు. కవి వేముగంటి మురళీకృష్ణ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కవి శివకుమార్, కవి, నట్వా ప్రభాకర్, కవులు, రచయితలు పాల్గొన్నారు.