Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ అధికారులకు పూర్తి స్వేచ్ఛ
- డ్రగ్స్ కేసులో మంత్రుల హస్తం
ఉన్నా అరెస్టు చేయండి
- మరింత దూకుడు పెంచండి
- జీవితకాలం శిక్ష పడేలా కొత్తచట్టాలు
- వ్యవస్థీకృత నేరాలకు ప్రత్యేక విభాగం
- హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలి
- డ్రగ్స్, కల్తీలపై సమీక్షలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డ్రగ్స్ కేసులో ఎంతటి వారైనా సరే పట్టుకోండి.. ప్రముఖు లైనా వదలొద్దు.. రాజకీయ నాయకులున్నా సరే కేసు పెట్టండి.. టీఆర్‌ఎస్ వారి పాత్ర, క్యాబినెట్ మంత్రులు ఉన్నా సరే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించాలని, ఈ విషయంలో ఎవరిని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ కేసు విషయంలో మరింత దూకుడు పెంచాలన్నారు. అన్ని కోణాల నుంచి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి ఎంతటి వారున్నా కేసులు నమోదు చేయాలని తెలిపారు.
డ్రగ్స్ కేసులో నిందు తులకు జీవితకాలం శిక్ష పడేందుకు కొత్త చట్టాలు తేవాలని సీఎం చెప్పారు. డ్రగ్స్ అరికట్టడంలో ఇప్పటికే చేపట్టిన చర్యలతో సంతృప్తి చెందకుండా మరింత దూకుడు పెంచాలన్నారు. ఈ దందాలో భాగస్వామ్యం ఉన్నవారెందరో దొరుకుతున్నారు. ఎవరి పాత్ర ఎంతుందో వెలికి తీయాలని ఇందులో అధికారులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకు తలొంచొద్దన్నారు. డ్రగ్స్, కల్తీలు, ఇతర సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పద్మారావు, ప్రభుత్వ
ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా ఎప్పటి నుంచో ఉందన్నారు. ప్రారంభంలోనే దీనిపై దృష్టి సారించి ఉంటే రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరిగి ఉండేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. గత పాలకులు డ్రగ్స్ మాఫియాపై దృష్టి సారించి ఉంటే ఇప్పుడు ఈ దుర్మార్గం మనకు వారసత్వంగా వచ్చేది కాదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడటం అత్యంత అవసరమని చెప్పారు. హైదరాబాదే తెలంగాణకు 'లైఫ్‌లైన్' కాబట్టి రాజధానిలో ఇలాంటి అరాచకాలు అంతం కావాలన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేయలేము.. వినియోగించలేమన్న భయ భ్రాంతులకు గురయ్యేలా చర్యలు ఉండాలని చెప్పారు. గుడుంబా నియంత్రణ విషయంలో విజయం సాధించినట్టే డ్రగ్స్, కల్తీల విషయంలో కూడా తుది వరకు విజయం సాధించే వరకు విశ్రమించొద్దని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆహార పదార్థాల కల్తీ, విత్తనాల కల్తీల విషయంలో అధికారులు బాగా పని చేస్తున్నారని సీఎం కితాబిచ్చారు. డ్రగ్స్‌ను అరికట్టడంలో కూడా అలాగే పని చేయాలన్నారు.
నా మనస్సు చలించింది.
కల్తీ రక్తం విషయంలో నా మనస్సు చలించిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బతికిస్తాడని నమ్మి వచ్చిన వారిని చంపుతారా? ఇది దుర్మార్గం, ఇలాంటి వారిని ఏం చేసిన చేసిన తప్పులేదన్నారు. వీరికి యావజ్జీవ శిక్షపడేందుకు కొత్త చట్టాలకు రూపకల్పన చేయాలని సీఎం అధికారులకు సూచించారు. కల్తీ రక్తం విషయంలో అసలు సూత్రధారులు ఎవరో గుర్తించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
శాంతిభద్రతల విషయంలో పురోగతి
రాష్ట్రంలో శాంతిభద్రతలు, సామాజిక రుగ్మతలు, సంఘ వ్యతిరేక కార్యాకలాపాల నియంత్రణ విషయంలో పురోగతి సాధించామని సీఎం అన్నారు. ఈ మూడేండ్లలో ఉన్నంత ప్రశాంతత చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. అక్రమాల విషయంలో ఉక్కుపాదం మోపే విషయంలో ఎలాంటి రాజీపడొద్దని, ఈ వేడి, ఈ ఒత్తిడి కొనసాగించాలన్నారు. ఇందుకు సంబంధించి మీకు కావల్సిన బలం, బలగాలను ఇస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు అమలులో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 95 శాతం గుడుంబాను అరికట్టామన్నారు.
అక్రమాలపై నిరంతరం నిఘా
ఆహార పదార్థాలు, కల్తీ పదార్థాలు, నకిలీ విత్తనాలు, డ్రగ్స్ సరఫరా తదితర వ్యవస్థీకృత నేరాలని, వాటిని అరికట్టడానికి నిరంతరం నిఘా పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిరంతర నిఘా కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఒకసారి కేసు పెడితే పని అయిపోయిందని అనుకోవద్దని సూచించారు. కల్తీలు, డ్రగ్స్ విషయంలో బాగా పని చేసిన పోలీస్ అధికారులకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా కిందిస్థాయిలో పని చేసే పోలీస్ సిబ్బందికి ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి బాగా పని చేసేలా ప్రోత్సహించడంతో పాటు ఇంక్రిమెంట్లు అందజేయడంతో పాటు, ఆగస్టు 15న వారికి అవార్డులు అందజేస్తామన్నారు.