Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయిల్ ట్యాంకర్ పేలి ఎగిసిపడ్డ మంటలు
- 15 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
- అక్రమ పెట్రోల్ దందానే కారణం ?
- మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో
శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ పేలి పెద్దఎత్తున శబ్ధాలు వస్తూ ఒక్కసారిగా నాలుగంతస్తుల మేర మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టూ 100 మీటర్ల మేర దట్టమైన పొగ కమ్ముకుంది.
అగ్నికీలలు ఎగిరిపడి రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనదారులపై పడ్డాయి. దీంతో భయాందోళనకు గురై స్థానికులు, వాహనదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడు ద్విచక్ర వాహనాలు తగులబడిపోయాయి. ఏడుగంటలపాటు అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఆయిల్ ట్యాంకర్ నుంచి అక్రమంగా పెట్రోలు తీస్తుండగా ఈ ఘటన జరిగిందా? ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
నవతెలంగాణ - బోడుప్పల్/చిలకలగూడ
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలో ఎస్వీ గార్డెన్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ మెకానిక్ షెడ్డు ఉంది. ఈ షెడ్డు నుంచి వచ్చిన నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఆయిల్ ట్యాంకర్‌కు తాకడం ఈ ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. నిప్పురవ్వలు ఇటు ఆయిల్ ట్యాంకర్‌కు, పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్లకూ మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆయిల్ ట్యాంకర్ సుమారు 30 అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. నిమిషాల్లోనే మంటలు నాలుగంతస్తుల మేర ఎగిసిపడ్డాయి. 100 మీటర్ల మేర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనదారులకూ మంటలు అంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో ప్రజలు, వాహనదారులు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మూడుగంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. ఏడు ద్విచక్ర వాహనాలు తగులబడిపోయాయి. ట్యాంకర్ పేలిన సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న చెంగిచర్ల డిపో సూపర్‌వైజర్ వెంకట్ నాయక్‌పై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడ్డవారిలో ఆరుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అందులో వెంకట్‌నాయక్, స్వామి, వాసు పరిస్థితి విషమంగా ఉంది. గోపాల్, ఇబ్రహీం, జలీల్, నాగరాజు, నిఖిల్‌రెడ్డికి పదిశాతం మేర కాలిన గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. సీఐ కె.జగన్నాథ్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ గోనె సందీప్‌రావు ప్రమాదస్థలికి చేరుకుని వివరాలు ఆరాతీశారు. ట్యాంకర్ నుంచి ఆయిల్ తీస్తుండగా ప్రమాదం జరిగిందా? వెల్డింగ్ చేస్తుండగా జరిగిందా? ఆయిల్ ట్యాంకర్ రోడ్డుపక్కనే ఉన్న ప్రహరీగోడను ఢకొీట్టడంవల్ల జరిగిందా? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నామని డీసీపీ తెలిపారు.
ప్రమాదంపై పలు అనుమానాలు...
భారీఎత్తున్న సంభవించిన ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ ట్యాంకర్ రిపేర్ చేస్తున్న క్రమంలో లేదా, ట్యాంకర్ నుంచి పెట్రోల్‌ను అక్రమంగా తీస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఎస్వీ గార్డెన్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ల నుంచి కొందరు బడా వ్యక్తులు పెట్రోల్, డీజిల్ తీసి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నట్టు స్థానికంగా వినబడుతోంది. అయితే కంపెనీ నుంచి వచ్చిన ట్యాంకర్ సీల్ తీసేందుకు ఇనుప రాడ్లను, కట్టర్లను వాడతారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఏర్పడతాయి. దీంతోనే ఈ భారీ ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి : సీపీఐ(ఎం)
ఘటనపై పూర్తి విచారణ జరపాలని సీపీఐ(ఎం) మేడిపల్లి కార్యదర్శి ఎన్.సృజన డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య ఇలాంటి ప్రమాదకరమైన ఆయిల్ ట్యాంకర్లు, పెట్రోలు ట్యాంకర్లు పార్కింగ్ చేస్తున్నా పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు స్పందించి పూర్తి విచారణ చేసి, బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.